Tuesday, December 8, 2015

తెలుసా…

వర్షమంతా వచనంగా మారిపోయాక
పొడిబారి ఆకాశం పొందిగ్గా నవ్వుకున్నాకా
తడి అంటని స్పర్శల్లో
ఇక మిగిలినవన్నీ క్రోడీకరింపబడిన భావాలే

నాకిష్టమైనదేవిటో
స్పష్టపరచలేకపోతున్న బాధనంతా
నా గది గోడలపైన చిత్రించుకున్నాక
నా ఆనందాలన్నీ
ఆ రంగుల్లో మెరిసే నా ఊహలే
నా ఏకాంతాలన్నీ
మదిలోపలి పుస్తకంలో
పద్యాలుగా రాసిపెట్టుకున్నాక
అక్షరాలన్నీ నవ్వించే చంద్రవంకలే

నీతో మాట్లాడటమంటే ...

నీతో మాట్లాడటమంటే
పూలు వికసించే దారిలో నడవడం
నీ మాటల్లో సీతాకోకచిలుకలు
పుప్పొడిని వాక్యాంతాలుగా చల్లుతుంటే
అలా నేనో ఆశ్చర్యార్థకాన్నైపోవడం

నిన్ను వింటున్నంతసేపూ
లోపల సుడులు తిరుగుతున్న సంగీతం
నన్ను తనలోకి లాక్కున్నాక
నేనో పూవునై కోటి రేకులతో విచ్చుకోవడం