Thursday, July 31, 2014

ప్రతి రోజూ ఇలా …

రాత్రి వెన్నెల్లో ఆరేసుకున్న భావాలతో
ప్రభాత పక్షి కొత్త బాణీలు కడుతుంది.
 
కడలి దొన్నెలో మిశ్రమించి పెట్టుకున్న రంగులతో
నింగి తూరుపు చిత్రం గీసుకుంటుంది.
 
సెలయేటి నవ్వులమీది ఎగురుతూ ఆటాడే
వజ్ర దేహపు చంద్ర కిరణంలాగో
లేత చిగురాకు బధ్ధకపు విరుపులో పడి
మెలికపడే తొలి సూర్య కిరణం లాగో
ఒక్కోసారి చల్లగా, మరో సారి వెచ్చగా
చక్కిలిగింతలు పెడుతుంది గాలి.

అలంకారాలన్నీ వదిలేసి
నింగికెదురుగా నిలబడి
ఒక్క ప్రకృతి చిత్రానికైనా
కనుపాప దోసిలి పట్టాలి
 
సన్న జాజితీగల్ని
మృదువుగా మీటే గాలి కొనగోళ్ళ స్పర్శలాంటి
జగన్మోహనాస్త్రమొకటి
గుండెల్లో గుచ్చుకోవాలి.
నింగి బుగ్గన సొట్టలా మొదలై
అనంతంగా విస్తరించే
వెలుగు దరహాసంలా
ఈ పొద్దు విరబూసి
తనలోని మధువుతోనే
మలి పొద్దుకు మెత్తని ఊయలేసి
తృప్తిగా నిష్క్రమించాలి.

ఈ రాత్రి

ఈ రాత్రి
ఒక ఖాళీ పాత్ర
సశేష స్వప్నాలైనా
ఇందులో రాలి పడవు.

ఈ రాత్రి
ఒక నిశ్శబ్ద నది
ఏ వెన్నెల పూలూ
దీని దేహం పైన విచ్చుకోవు.

ఈ రాత్రి
అనంతాలోచనాంబుధిలో
విఫలమవుతున్న వల
ఏ జలచరమూ
దీనికి చిక్కదు.

కానీ ఎప్పటికైనా ...
ఈ రాత్రి
ఉషోదయానికి గురిపెట్టిన శరమై
నైరాశ్యపు వింటి నారిని విడవాల్సిందే
ప్రభాతకాంతిలో మునిగి
దరహాస రేఖల్ని ధరిస్తూ
త్రుళ్ళుతూ ప్రవహించాల్సిందే.

మరచిపోయావేం ?




పాడతావా ఇక్కడైనా
గానాలు గుబులుపడ్డ గొంతులో
వర్షిస్తావా ఒక్క గమకాన్నైనా ...

ప్రేమిస్తావా ఇవాళైనా
రంగులు ఎండిపోయిన కుంచె కుచ్చిళ్ళని

సవరిస్తావా ఇప్పుడైనా ...

కవివౌతావా ఈ క్షణాన్నైనా
అక్షరాలు వెలేసిన పుస్తకం మీద
ముద్రిస్తావా నీ హృదయ రహస్యాలనైనా ...

పచ్చటి ప్రేమలేఖల్ని కోరుకోవడం
తప్పు కాదు కానీ,
ముందు నువ్వు నా హృదయద్వారం దగ్గర
తెరిపి పడి, తేటపడి, తేలికపడి
సంగీత ఝరిగా కరిగి
పెదవులమీదకి ఒలకడం
మరిచిపోయావెందుకీసారి ??