రాధ
ఉలిక్కిపడింది. తననెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగా వచ్చిపిలిచినట్టు. చెవి పక్కన చెంపల మీదుగా జారి ఒంపు తిరిగిన కురులు కూడా చిన్నగా వణికాయ్.
అప్పటివరకూ
నల్లనయ్యను తలుచుకుంటూ , కూనిరాగాలు తీస్తూ చిలికిన వెన్న జాగ్రత్తగా మట్టి కుండలోకి తీసిపెడుతున్నదల్లా రెపరెపలాడుతున్న హృదయంతో తలెత్తి చుట్టూ చూసింది. ఎవరూ లేరు… ఎప్పటిలాగే ఉన్నాయ్ పరిసరాలు.
తిరిగి
తన పనివైపు దృష్టి సారించింది కానీ ఏదో అలజడి మనసంతా. ఆమెకు తెలీకుండానే అంతకంతకూ వేగవంతమవుతూ ఎదని ఊయలూపుతోంది ఊపిరి. బుగ్గలు బరువెక్కి , ఎరుపెక్కి ఏదో పరవశం పెదవుల్లోకి కూడా పాకి వణికిస్తోంది.
త్వరగా
పని ముగించుకుని ముందు గదిలోకి వెళ్ళి గుమ్మానికానుకుని నిలబడి ఆకాశం వైపు చూసింది. నిండు చంద్రుడు కొంటెగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఏవిటో అర్ధంకాలేదు. ఇప్పుడే.. ఈ క్షణంలోనే నల్లనయ్యని చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఎలా? ఈ సమయంలో వెళితే అమ్మ ఏమంటుందో. తల తిప్పకుండానే ఓరగా తల్లి వైపు చూసింది. చుట్టుపక్కల వారితో కలిసి ముచ్చట్లలో ఉందావిడ.
తిరిగి
ఆకాశం వైపు చూసింది. అంతవరకూ లేనిది ఎక్కడి నుండి వచ్చాయో నల్లమబ్బులు. వేగంగా కదిలిపోతున్నాయ్. అప్పటిదాకా వెన్నెల్లో వెలిగిపోయిన పరిసరాలన్నీ కృష్ణవర్ణాన్ని పులుముకుని ఆమెకేదో చెప్పాలని చూస్తున్నట్టుగా అనిపించాయ్. చల్లటి గాలి తనువుని తాకి ఆమె పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ఎక్కడెక్కడి పూల పరిమళాలనో పట్టుకొచ్చి గాలి ఆమెని సాంత్వన పరచాలని చూసింది కానీ, ఆమె పరిస్థితి మెరుగవలేదు.
ఎక్కడినుంచో
సమ్మోహన వేణు గానం తనని పిలుస్తున్నట్టుగా వినపడింది. అంతే, ఇక ఆమె తన ఎరుకని మరిచిపోయింది. మెరుపు వేగంతో కదిలింది.
“ఈ సమయంలో, ఈ వాతావరణంలో ఎక్కడికమ్మా …” అంటున్న తల్లి మాటలు రాధ చెవులకి వినపడలేదు.
రాధ
తల్లి సరిగ్గా గమనించి ఉంటే రాధ అలా వెళ్ళడం వల్ల కదిలిన ఆమె జడ కుచ్చుల సవ్వడిలోనో, పద మంజీరాల కులుకుల్లోనో , పొడవాటి చెవి జూకాల ఊపులోనో ఆమెకి సమాధానం దొరికేసి ఉండేది.
ఏదో
మాయ కమ్మినట్టుగా యమునా తీరంలోని ఆ పచ్చిక బయలుకేసి నదిలా కదిలింది రాధ.
ఆమె
పరిమళాన్ని అల్లంత దూరంనుంచే ఆఘ్రాణించి లిప్త కాలంపాటు మురళీ గానాన్ని ఆపాడు కృష్ణుడు. అతని కళ్ళలో యమున వలపుగా మెరిసింది. చెంపల్లో తామరలు విచ్చుకుని రాలి ఒక విధమైన కెంపు మెరుపులతో ఆ ప్రదేశాన్ని వెలిగించాయ్.
పరుగులాంటి
నడకతో అక్కడికి చేరుకున్న రాధ అలా కృష్ణుడిని చూస్తూనే శిలలా నిలబడిపోయింది. రెప్ప మరచిన ఆమె కన్నుల నీలిమల్లో చంద్రోదయాలయ్యాయి. అమె కళ్ళలోంచి దూకుతున్న వెన్నెల వెలుగు, విశ్వ మోహనుడి తనూ వర్ణంతో కలిసి ఆ ప్రదేశమంతా అలౌకికమైన, అవ్యక్తమైన వర్ణంతో శోభిల్లింది. అక్కడి నీరూ, చెట్టూ, చేమా, పూలూ , తుమ్మెదలూ అన్నీ పరవశంతో ఉలిక్కిపడ్డాయ్.
తన్మయంగా
కృష్ణుడిని చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆతని ఒడిలో వాలిపోయింది రాధ. ఆ మానస మనోహరుడి కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అంది
“నిన్ను చూడగానే నాలో కలిగే ఈ ప్రేమ
ప్రపంచాన్ని
ముంచేసేలా విస్తరిస్తుంటే
కృష్ణా…
కాలం
కవిత్వమైపోయి
మనిద్దరి
దేహాల మీదుగా ప్రవహిస్తున్నట్టు లేదూ… “