Sunday, March 20, 2011

నా చిన్నప్పటి పెయింటింగ్స్ - 2






ఈ పెయింటింగ్ టెంత్ పరీక్షలు అయిపోయాక వేసినది. :-)

2. గణపతి

  


ఈ గణపతి పెయింటింగ్ మొట్టమొదటి సారి ఆయిల్ కలర్స్ వాడి , హార్డ్ బోర్డ్ మీద వేసినది. అప్పట్లో ఆయిల్ పెయింటింగ్స్ ఎలా వెయ్యాలో తెలీదు. అయినా ఆయిల్ పెయింటింగ్స్ వెయ్యాలని చాలా కోరికగా ఉండేది. ఎక్కడైనా నేర్చుకుందామంటే చదువుతో కుదిరేది కాదు. ఇంక ఆపుకోలేక experiment చేసేసా.   :-)





Wednesday, March 16, 2011

జలపాతం

ఆ జలపాతం ముందు
దోసిలి పట్టుకుని
ఎంతసేపుగా నిలబడ్డాను?


నిండినట్టే నిండి
తిరిగి తన అస్తిత్వంలోకే
ఆవిరైపోతూ...కవ్విస్తూ...


తడిసిన మనసు సాక్షిగా
అందీ అందని సంతకం కోసం
తెల్ల కాగితం విరహించిపోతోంది


అలుపెరుగని నృత్యానికి కూడా
చలించని ఈ బండరాళ్ళలో
కానీ కానని  చిరునవ్వేదో
దోబూచులాడుతూ...చిక్కుముడి విప్పుతూ.


మనిషి కందని రాగంతో
సాగిపోతున్న అంతులేని పాటలో
అపురూపమైన రహస్యమొకటి
అర్థమయ్యీ కానట్టు...


తన సమక్షంలో
నిమేషించని కన్నుల సాక్షిగా
విలీనమైపోతూ కూడా
అందుకోలేకపోతున్నాను...

Tuesday, March 15, 2011

భూతాల రాజు ప్రేతాల రాణి .. జానపద నవల

నా చిన్నప్పుడు మా వూరిలోని అద్దె పుస్తకాల షాపు నుంచి సెలవుల్లో ఇలాంటి మంచి జానపద నవలలు తెచ్చుకుని చదువుతూ ఉండేవాళ్ళం. అప్పట్లో ఈ జానపద నవలలు చిన్న చిన్న పుస్తకాలుగ ఎన్ని ఉండేవో. బస్ స్టాండుల్లో ఉండే పుస్తకాల షాపుల్లో కూడా దొరికేవి. ఇప్పుడు కావాలన్నా ఎక్కడా దొరకటం లేదు. అప్పుడే అవన్నీ కొనేసి జాగ్రత్త పెట్టుకుని ఉంటే ఎంత బావుండేదో అనిపిస్తుంది అస్తమానూ.

ఇవాళ pustakalu.com చూస్తుంటే అదృష్టవశాత్తూ ఈ పుస్తకం ebook కనిపించింది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఈ పేరు, అట్ట మీద బొమ్మ కూడా నాకింకా గుర్తున్నాయి. వెంటనే డవున్లోడ్ చేసుకున్నాను. మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి చదవడానికి.

జానపద నవలలు ఆసక్తి ఉన్నవారెవరికైనా ఇలాంటి నవలలు ఆన్లైన్లో ఉన్నట్టు తెలిస్తే , దయచేసి లింకులు ఇక్కడ ఇవ్వండి. ప్లీజ్ .. లేక ఇలాంటి పిల్లల నవలలు ఎక్కడైనా ఇంకా దొరుకుతున్నట్టు మీకు తెలిసినా ఆ వివరాలు తెలియచెయ్యండి  ...ప్లీజ్ ..

ఎవరి వద్దనైనా అప్పటి జానపద నవలల పుస్తకాలు ఇంకా భద్రం గా ఉంటే , అవి ఆన్లైన్లో పెట్టే ప్రయత్నాలు చేద్దాం. ముందుకు వస్తే సంతోషం.