నీతో ఆడుకునే ఆ
నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో
మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి
కొంగల్ని రోజూ చూస్తున్నా, ఏదో భావాన్ని భాషతో చిత్రించలేకపోయినట్టు, నీ
వెనుక గిరికీలు కొడుతూ మేము చల్లే వెలుగుల్ని తూచలేరెవ్వరూ.
ఎక్కడిదో మంచు
మల్లెపూలుగా మారి చారెడేసి కళ్ళలో చలువ పందిళ్ళు వెయ్యడం, ఒక్క వాన చుక్క
వెయ్యి వాక్యాలుగా విడిపోయి, మనసు పల్లాలోంచి జారి గుండెలో ఊట బావిగా
స్థిరపడటం, ఎక్కడ విరిసిన పూలో గుండె గోడల మీద ఆడుకోవడం,
ఇప్పుడిక్కడున్నవాళ్ళందరూ అనుభూతిస్తారు.
అదిగో,
విశ్వసంబరాల్ని సంధ్య ప్రమిదలోకి జార్చి, ఆకు కొసల్ని వెలిగిస్తోంది చూడు
వెన్నెల. రెక్కలింక ముడుచుకుని, గూటికి తిరిగి చేరేముందు వెన్నెల్ని
చుట్టేసి పట్టుకెల్దాం మర్చిపోకేం.
(మొదటి ముద్రణ 25-09-2014 సారంగ పత్రికలో )
No comments:
Post a Comment