Thursday, July 31, 2014

ప్రతి రోజూ ఇలా …

రాత్రి వెన్నెల్లో ఆరేసుకున్న భావాలతో
ప్రభాత పక్షి కొత్త బాణీలు కడుతుంది.
 
కడలి దొన్నెలో మిశ్రమించి పెట్టుకున్న రంగులతో
నింగి తూరుపు చిత్రం గీసుకుంటుంది.
 
సెలయేటి నవ్వులమీది ఎగురుతూ ఆటాడే
వజ్ర దేహపు చంద్ర కిరణంలాగో
లేత చిగురాకు బధ్ధకపు విరుపులో పడి
మెలికపడే తొలి సూర్య కిరణం లాగో
ఒక్కోసారి చల్లగా, మరో సారి వెచ్చగా
చక్కిలిగింతలు పెడుతుంది గాలి.

అలంకారాలన్నీ వదిలేసి
నింగికెదురుగా నిలబడి
ఒక్క ప్రకృతి చిత్రానికైనా
కనుపాప దోసిలి పట్టాలి
 
సన్న జాజితీగల్ని
మృదువుగా మీటే గాలి కొనగోళ్ళ స్పర్శలాంటి
జగన్మోహనాస్త్రమొకటి
గుండెల్లో గుచ్చుకోవాలి.
నింగి బుగ్గన సొట్టలా మొదలై
అనంతంగా విస్తరించే
వెలుగు దరహాసంలా
ఈ పొద్దు విరబూసి
తనలోని మధువుతోనే
మలి పొద్దుకు మెత్తని ఊయలేసి
తృప్తిగా నిష్క్రమించాలి.

ఈ రాత్రి

ఈ రాత్రి
ఒక ఖాళీ పాత్ర
సశేష స్వప్నాలైనా
ఇందులో రాలి పడవు.

ఈ రాత్రి
ఒక నిశ్శబ్ద నది
ఏ వెన్నెల పూలూ
దీని దేహం పైన విచ్చుకోవు.

ఈ రాత్రి
అనంతాలోచనాంబుధిలో
విఫలమవుతున్న వల
ఏ జలచరమూ
దీనికి చిక్కదు.

కానీ ఎప్పటికైనా ...
ఈ రాత్రి
ఉషోదయానికి గురిపెట్టిన శరమై
నైరాశ్యపు వింటి నారిని విడవాల్సిందే
ప్రభాతకాంతిలో మునిగి
దరహాస రేఖల్ని ధరిస్తూ
త్రుళ్ళుతూ ప్రవహించాల్సిందే.

మరచిపోయావేం ?




పాడతావా ఇక్కడైనా
గానాలు గుబులుపడ్డ గొంతులో
వర్షిస్తావా ఒక్క గమకాన్నైనా ...

ప్రేమిస్తావా ఇవాళైనా
రంగులు ఎండిపోయిన కుంచె కుచ్చిళ్ళని

సవరిస్తావా ఇప్పుడైనా ...

కవివౌతావా ఈ క్షణాన్నైనా
అక్షరాలు వెలేసిన పుస్తకం మీద
ముద్రిస్తావా నీ హృదయ రహస్యాలనైనా ...

పచ్చటి ప్రేమలేఖల్ని కోరుకోవడం
తప్పు కాదు కానీ,
ముందు నువ్వు నా హృదయద్వారం దగ్గర
తెరిపి పడి, తేటపడి, తేలికపడి
సంగీత ఝరిగా కరిగి
పెదవులమీదకి ఒలకడం
మరిచిపోయావెందుకీసారి ??

Monday, June 16, 2014

తెలుగు వెన్నెల్లో తేనె మనసులు - నవల

కినిగె అక్షరలక్షల నవలలపోటీ కి పంపిన నా నవల తెలుగు వెన్నెల్లో తేనె మనసులు. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయ ప్రార్థన .

http://kinige.com/kbook.php?id=3045

 

Sunday, February 16, 2014

ఒక తియ్యని కల

         

అన్ని నక్షత్రాలనూ దాటుకుని
ఆ కల మళ్ళీ వస్తుంది.
ఎదురు చూడని ఏ రాత్రిలోనో
కాస్తంత వెన్నెలని
కొంగున కట్టి పోతుంది.

ఊహలకు మల్లే
కుంచెలూ, రంగులూ
మేళవించే మెళకువలు
ఏవీ అనుమతించని కల
నిద్ర ముఖం మీద
చల్లటి చిలకరింపై
తనకు తానుగా
అలంకరించుకు వస్తుంది.
          హద్దులకో పద్దులకో భయపడి
          ఏ మలుపుల్లోనో
          నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని
          ఆ నిరభ్యంతరపు క్షణాల్లో
          నిర్భయంగా చూపిస్తుంది
వాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల
నన్ను చుట్టుకునే ఉంటుంది.
          నావి కాలేకపోతున్న క్షణాలతో
          నేను పడుతున్న ప్రయాసలో
          చెమటని తుడిచే
          చిరుగాలై వస్తుంది.
          బలవంతపు సంతకాలలో
          బరువు దించే నిట్టూర్పై వస్తుంది.
అవును. అన్ని నక్షత్రాలనూ దాటుకుని
నిద్ర సిగలో వికసించడానికి
ఆ కల మళ్ళీ వస్తుంది.
 

(జనవరి ఈమాట వెబ్  పత్రికలో ప్రచురితమయింది. )

Monday, December 16, 2013

నా ఏకాంతక్షణాలు




బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది.

గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా, అక్షరాన్ని ఆప్యాయంగా తడుముకుని ఎన్నాళ్ళయిందోనని ఙ్ఞప్తికొచ్చాక, నా గది గవాక్షన్నే ముందుగా తెరుస్తాను.

వెన్నెల తివాచీలు పరుస్తూ చంద్రుడూ, పన్నీరు జల్లుతూ చల్ల గాలీ నా వెనుకే వస్తారు.



నా అడుగుల సవ్వడి వినపడగానే ఆ పూదోట మెల్లగా విచ్చుకుంటుంది.

ఎందుకో మరి, అలిగి విరిగి పడ్డ మబ్బు తునకలు, దారంతా కాళ్ళ కింద నలుగుతూ ఎదురుచూడని ఏ రాగాన్నో అస్పష్టంగా గుణుస్తున్నట్టున్నాయ్.

ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.  చీకటీ , నిశ్శబ్దం సంగమించే సమయం ఎంత అపురూపం?   కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.


చంద్రుడినుంచి ఒకే ఒక్క కౌగిలి పుచ్చుకున్న స్ఫూర్తితో ఎక్కడున్నా వెలిపోయే మబ్బు తునకలాగో,

అడవి నుంచి ఒకే ఒక్క రంగుని తీసుకుని గాలిలో విలీనమవుతూ సాగిపోయే పాట లాగో

నువ్వన్న ఒకే ఒక్క మాట, కొన్ని వేల ప్రతిధ్వనులుగా విడిపోయి, వెచ్చటి ఊపిరి లోంచి బయటికొస్తూ అదో రకమైన మత్తులో నన్ను ఓలలాడించిన ఙ్ఞాపకమొకటి నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంది.



క్షణాలన్నీ నన్నే ఎత్తుకుని లాలించే ఈ అద్వితీయమైన ఏకాంతం కోసమే పగలంతా ఎదురు చూస్తాను.  కొన్ని అరుదైన పూరేకుల్ని దోసిట దొరకపుచ్చుకుని సంతృప్తిగా  నా గది గవాక్షం వైపు సాగిపోతాను.

(డిసెంబర్ 12 సారంగ ఈ పత్రిక లో ప్రచురితం )

Wednesday, December 4, 2013

చెవుల్లో అమృతం

అచ్యుతాష్టకం అంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. అయితే ఎప్పుడైనా పుస్తకంలో చూసి చదవడమే కానీ ఆడియో వినే ప్రయత్నం చెయ్యలేదు. ఈ మధ్య యు ట్యూబ్ లో వెతికితే 'ఆచ్యుతాష్టకం బై యేసుదాస్ ' అన్న లింకు వచ్చింది. ఇంకేముంది? యేసుదాసు గొంతులో అచ్యుతాష్టకం వింటుంటే నిజంగా చెవుల్లో అమృతం పొయ్యడమంటే ఏమిటో అనుభవంలోకొచ్చింది. పదాల్లోని మాధుర్యాన్నంతా గొంతులో ఒంపుకొని శ్రోతల్ని భక్తి భావం లో ముంచేస్తున్నాడు. అప్పటి నుంచీ రోజుకి ఒక్కసారైనా వినకుండా ఉండలేకపోతున్నాను.  

మీరూ వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి మరి.  

http://www.youtube.com/watch?v=kFpVxy6jNPM