Sunday, June 27, 2010

My First Animation short

2007 లో సొంతంగా flash నేర్చుకుని చేసిన నా తొలి యనిమేషన్ short.
ఎంతో కష్టపడి నేర్చుకుని చేసిన తోలి short కాబట్టి quality excuse చేసెయ్యండి :-)

Watch Sun and the bud. animated video on aniboom

Saturday, June 26, 2010

ఈ స్కెచ్ కూడా చిన్నప్పుడు వడ్డాదిపాపయ్యగారి పెయింటింగ్ చూసి వేసినదే.

రాధా కృష్ణులు

ఈ స్కెచ్ నా చిన్నప్పుడు వడ్డాదిపాపయ్యగారి పెయింటింగ్ ఒకటి చూసి వేసినది

మేఘానికి మరోవైపు

ఆకాశం తలుపు తెరిచేదాకా
హృదయ భారాన్ని మోస్తూ
సంచరిస్తూనే ఉంటాను...

కొన్ని కోట్ల అశ్రు బిందువుల
వేడి నిట్టూర్పులకి
కదిలిపోతున్న నన్ను చూసి

పిచ్చి నెమలి
పురివిప్పుకుంటోంది...

నా నీడ స్పర్శకే
చిక్కబడిన ప్రకృతి రంగులకోసం
వెర్రి గాలి గుబాళిస్తూ
సాగిపోతోంది.

ఎన్ని కవితా హృదయాలు
భావోద్వేగపు చూపుల
బాణాలు విసిరినా...
ఇప్పుడు
నా మది కాలువలో
కాగితం పడవలై తేలిపోతూంటాయి

ఎదురుచూపుల్లోనే కరిగిపోయే
నా వేదాంతి నవ్వుకి కూడా
పులకించిపోతూ పుడమి.

దారంతా పూలచెట్లు...

 ఎవరి ప్రేమ లేఖలకు
వ్రాసుకున్న తీపి జాబులో
ఈ చెట్టుకు ఒళ్ళంతా విచ్చుకున్న పూలు...

అలవోకగా వీచే
ఏ చిరుగాలికో
రాలిన పూలని
మురిపెంగా కావలించుకునే
పచ్చగడ్డి తీరు...

తుడిచిపారెయ్యకండి వీటిని...

రాలిన పూలు కూడా
ఇక్కడి గాజుబొమ్మల్లో
జీవాన్ని నింపుతున్నాయ్

ఈ దృశ్య పుష్పాలు చాలు...
అద్దాల మేడల్లో
అనంతమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ
ఊపిరి జాడలు...

మరొక్కసారి ..

చినుకై రాలిన మేఘాన్ని
ఆకాశం తిరిగి పొందినట్టు

కోల్పోయిన ఆత్మీయుల్ని
మనిషి పొందగలిగితే
ఎంత బాగుండును !!

మరచిపోయిన దారుల్లో
నది తిరిగి ప్రవహించినట్టు

గతకాలపు గుంటలోకి
వర్తమానాన్ని మళ్ళించగలిగితే
ఎంత బాగుండును !!

ఈ తీరం
ఇష్టంగా చేరిన గమ్యమే అయినా
అసంతృప్తితో జారిపోతున్న
ప్రతి క్షణమూ
సిగ్గుపడేలా

బాల్యాన్ని చూపించనూ !

Friday, June 25, 2010

ఈ రోజు ...

తొలి మంచు నిశ్శబ్దం
శ్రావ్యంగా గుడి గంటలు.

చాలు ...
మనసు మేల్కొంది.

ఇక ఈ రోజు పేజీ
ఏ కాలుష్యానికి మసిబారినా

నీలపు రేయి చిక్కబడే వేళకి
వెన్నెల కడిగిన కవితలా
అలరించగలదు.

ఆకాశం ...

ఆకాశం గొప్ప
చిత్రకారిణి
తన మీద తనే
ఎన్ని చిత్రాలు గీసుకుంటుందో .

----

పగలంతా సూర్యుడినీ
రేయంతా చంద్రుడినీ
ఆడించి అలసిపోయే
ఆకాశానికి
అమావాస్య పూట మాత్రమే
సెలవిస్తాడు దేవుడు .
---

రాత్రి తన కొంగు కప్పి
చల్లగా జోకొడుతున్నా
నిద్రపోదు ఆకాశం.
చుక్కలన్నిటినీ పోగేసి
కబుర్లేసుకుంటుంది.

Tuesday, June 22, 2010

ముఖ్యమైన వాళ్ళకు

కొన్నిసార్లంతే ...

హృదయ స్పందనలోంచి పుట్టిన
భావాల సీతాకోక చిలుకల్ని
గుండెలోనే బంధించడం తప్ప
స్వేచ్చగా వదల్లేం...

దోసిట్లో పట్టుకున్న వాన నీరు
వేళ్ళ సందుల్లోంచి జారిపోయినా
ఆకాశపు కబుర్ల హాయి
అరచేతుల్లో ఇంకా చల్లగా ...

కురిసే వర్షాన్నీ
పెరిగే వెన్నెలనీ
ఆస్వాదించిన సమయం
వృధా అనుకుంటే
బ్రతకడం రానట్టే ...

Saturday, June 19, 2010

ఒక్కో ఉదయం...

తూర్పు వికసించి
కలల పక్షులు ఎగిరిపోయినా

ఒక్కో ఉదయం...
ఏ పిట్టా వాలని చెట్టులా
నిస్తేజంగా

నా పని కొమ్మ చుట్టూ ఇంతమంది
ఆకుల్లా గల గల లాడుతున్నా

కదిలించే ఒక కిల కిల రావం కోసం
మనసు తపిస్తూ...

అణువణువూ పులకించి పుష్పించాలంటే
నీలిమబ్బు వలపుధార
నాకిప్పుడు కావాలి