Wednesday, October 30, 2013

ఎదురుచూపు
















పుడమి నేర్పిన రాగాలన్నీ
ఎక్కడి దాహార్తుల మీద కురిపించడానికో
ఈ మేఘాలన్నీ గుంపుగా కదిలి పోతున్నాయ్.

ఒక్క పల్లవినైనా ఇక్కడ జారవిడిస్తే బాగుణ్ణు
లోపలొక ఉప్పెనొచ్చి
హృదయాన్ని ప్రక్షాళించి వెళుతుంది

Friday, October 18, 2013

ఒక్కసారిగా ఎంత వెన్నెల - 1

 
 
 
 
చీకటి...చీకటి...
మండుటెండలో సైతం 
మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి.   
పొద్దు వాలినా
ఒక తేడా తెలీని తనంలోంచి
నిర్నిద్రతో
క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక  
నిరాశగా పడున్న
చందమామ పుస్తకంలోంచి 
వన దేవతో దయ తలచి వస్తుంది.
నొప్పి కళ్ళలో
కలను పిండి
తన చేత్తో కళ్ళు మూస్తుంది
 
చీకట్లను చేదుకుంటూ
పొగ బండి దూసుకుంటూ పోతుంది.  
 
ఎదురుగా ... 
ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం 
ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ
దోచుకోలేనంత వెన్నెల ... 
సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక
సాయం చెయ్యలేనని
భాష చేతులెత్తేసాక 
చేసేందుకేముంటుంది !
కవిత్వీకరించాలనే అలోచనలన్నీ 
ఒలిచిపారేసి 
ఒక్కసారి  
వెన్నెల సముద్రంలో
నాలోని నన్ను
కడిగేసుకోవడం తప్ప!  

Tuesday, October 8, 2013

ఈ సారైనా ...

ఈ సారైనా వెన్నెల శాలువా కప్పుకుని, నీ చెంత కాసేపు కూచోవాలనుకున్నాను. నీ చల్లటి చేతులతో నా పాదాలు నిమురుతూంటే, మెరిసే నీ కంటి వెలుగుల్నీ, నీ నవ్వుల్లో గల గలల్నీ లెక్కించుకుంటూ గడపాలనుకున్నాను. అలసిపోయిన ఆకాశం చీకటి చీరలో ముగ్ధంగా మత్తిల్లే వేళ, అదే రంగు చీరలో నువ్వు ఆకాశపు వెన్నెల మనసుని ప్రతిబింబిస్తూంటే మాయమైపోయిన జీవితాన్ని ఇక్కడ కాసేపు దర్శిద్దామనుకున్నాను. ఇలా ఓ కొబ్బరాకునైపోయి వేళ్ళసందుల్లో వెన్నెల బలపాలు పట్టుకుని గీసుకునే పిచ్చి గీతలు నీ చీరకుచ్చిళ్ళలోంచి జారిపోతుంటే, కిలా కిలా నవ్వుతూ చిరుగాలితో చెయ్యి కలిపి చప్పట్లు కొట్టాలనుకున్నాను. నీ కబుర్లతో తడిసిన దోసెడు క్షణాల్నీ ఘనీభవింపజేసి, గుండె పొదరింట్లో దాచుకోవాలనుకున్నాను.
కానీ ఎప్పటిలాగే, ఏకాంతంగా నీ చెంత కూచోలేని నిస్సహాయతను నిందించుకుంటూ నిష్క్రమిస్తున్నాను.