Monday, August 11, 2014

కొందరుంటారు…


సముద్రాలకావలెక్కడో, నారింజరంగు ఆకుల మధ్య, దోబూచులాడుతున్న కవితల్ని వెతుక్కుంటూనో, అడుగుమందాన కట్టిన మంచుని భావాల మునివేళ్ళతో పెకలిస్తూనో, అదీ కాకుంటే, మంచుని కప్పుకున్న ఇంట్లో, ముడుచుకుని కూర్చుని, కవిత్వంతో చలి కాచుకుంటూనో ...     

ఒక్కోసారి నిద్రని రజాయి కప్పి జోకొట్టి, బరువెక్కిన రెప్పల్ని తెరిచి పట్టుకున్న పదచిత్రాల వెలుగులో, అక్షరాల మాలికలల్లుతూనో, నింగి రాలుస్తున్న రవ్వల్ని శ్రధ్ధగా సేకరించి తెల్లకాగితానికి అలంకారాలద్దుతూనో...     

వాళ్ళెలాగో..., వసుంధరా సౌందర్య సేవనానుభూతిని మోయలేక, ఆకాశమెప్పుడో భళ్ళున బ్రద్దలైనప్పుడు,, వెన్నెల తరగల్లో కలిసిపోయి శ్రవిస్తున్న భావోన్మాదాన్ని ఒడిసిపట్టుకుని, కలంలో సిరాగా నింపుకుంటారు.  కోటి పువ్వులు వికసించే ఒకే ఒక్క క్షణాన్ని నిశ్శబ్ద రేయి నుంచి వేరు చేసి, సంతకానికి చివర చుక్క పెడతారు.    

వాళ్ళంతే. అందర్నీ ప్రేమిస్తారు. అందుకే కవితని ప్రపంచపు వివర్ణపు మనసు మీదకి ఎగరేస్తారు. గాల్లో తేలుతూ ... నింగి నుంచి మనసుకి సప్తవర్ణాల వంతెనలేస్తూ  .... అందుకోవాలే కానీ,  చేరుకోలేకపోతున్న లోపలి ద్వీపానికిప్పుడు స్పష్టమైన దారి పడుతుంది. నేనెక్కడో తప్పిపోయాననుకుంటాను కానీ, నన్ను నేను ఇక్కడే చూసుకోవడం గమ్మత్తుగా ఉంటుంది.        
(మొదటి ముద్రణ ఆటా 2014 ప్రత్యేక సంచిక 'అక్షర ' లో  )

2 comments:

  1. అబ్బా ప్రసూన గారూ! ముందు మీ వెబ్ పేజీ కలర్ ను లైట్ చెయ్యండి. చదవడం నాకు చాలా కష్టంగా ఉంది. అర్జెంటుగా చదవాల్సిన సంగతులు చాలా ఉన్నట్టున్నాయి మీ బ్లాగులో.
    రాజా.

    ReplyDelete
    Replies
    1. gks గారూ, టెంప్లేట్ మార్చాను. చదవడానికి ఇప్పుడు సౌకర్యంగా ఉందో లేదో చూసి చెప్పండి.

      Delete