అడవి
మనసుని
కొంతయినా
అర్థం చేసుకోవాలి
మొరటు
చెట్టుని ప్రేమగా
హత్తుకునే తీగల్లాగో …
సెలయేటి
ఒంపుసొంపులన్నీ సొంతమైనా
మోహాన్ని
కనపడనివన్ని బండరాళ్ళలాగో …
కాసేపు
మారిపోవాలి.
అడవి
అందాన్ని
కాసేపైనా
అరువు తెచ్చుకోవాలి.
ఇన్నేసి
ఉదయాల్ని
అద్భుతంగా
చిత్రిస్తున్న కిరణాల కుంచెల్ని
ఒడుపుగా
పట్టుకున్న ముని వేళ్ళకి
మనసారా
మ్రొక్కి రావాలి
అడవి
స్థితప్రఙ్ఞతని
కాస్తయినా
అలవర్చుకోవాలి
కాలం
ప్రతి ఋతువునీ దోచుకుని
కౌగిట్లో
కరిగించేస్తున్నా
నిరాశ
నీడల్ని తరిమికొట్టే
నిబ్బరత్వాన్ని
పొందాలి.
అడవి
వినయశీలతని
ఇనుమంతయినా
నేర్చుకోవాలి.
రాత్రి
చెప్పిన పాఠాలు విని
ఆత్మ
పరిశీలన చేసుకుంటూ
మలి ఉదయానికి
నన్ను
నేను పునర్నిర్మించుకోగలగాలి.
తిరిగి తిరిగి
పాడుతున్న
వెలిసిపోయిన
పాటల్ని
ఇవాళ
బహిష్కరించి
కాసేపయినా …
అడవిలా ఆకుపచ్చగా
పాడుకోవాలి.
No comments:
Post a Comment