Saturday, January 22, 2011

ఒక మాంచి డాక్టరు ...

ఈ మధ్యనే మాకూ తెలిసిన ఒక మంచి డాక్టరు గురించి నా బ్లాగ్ లో రాస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపించి ఈ టపా రాస్తున్నాను
మిగతా చోట్ల ఏమో గానీ సిటీల్లో హాస్పిటల్స్ కి వెళ్తే మాత్రం, నువ్వొక గుంపులో గోవిందానివి అన్నట్టే చూస్తారు. డాక్టర్ దాకా వద్దు ముందు చీటీలు రాసే చోట కూడా గౌరవం, మన ప్రశ్నలకి సమాధానం ఉండవు. పోనీ అవి బాగుంటే డాక్టర్ మన బాధ పట్టించుకోరు. అయిదు నిమిషాలే నీకు టైము అన్నట్టు ముఖం పెట్టి కొందరు, గంభీరంగా మౌనమే నా భాష అన్నట్టు కొందరు, నీకు వచ్చినవి కామన్ జబ్బులే లే నాకు చెప్పింది చాలు, బయట కాంపౌండర్ ఒక ప్రింటెడ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అని కొందరు. ఇలా ఉంది వ్యవహారం హైదరాబాదులోని చాలా హాస్పిటల్స్ లో.

ఇలాంటి చోట మంచి అంటే మంచి హస్తవాసి మాత్రమే కాదు మంచి గుణం కూడా ఉన్న డాక్టర్ తారసపడితే ఎడారిలో ఒయాసిస్సులా అనిపించేస్తుంది.

హైదరాబాదులో KIMS హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగం లో డాక్టర్ జివానీ గారి గురించి ఆయన పేషంట్ మాటల్లోనే ఒక్క ముక్కలో చెప్పాలంటే  "ఈయనని చూస్తేనే సగం జబ్బు తగ్గిపోతుంది... "

ఏ టైములో అయినా ఎంత రద్దీగా , యాంజియోగ్రాములు చేసాకో, రవుండ్స్ కి వెళ్ళొచ్చాకో ఆయనని కన్సల్ట్ చేస్తే కూడా, మన పేరు పిలిచాక ఆయన రూము లోకి అడుగుపెడుతూనే నవ్వుతూ పలకరించి షేక్ హాండ్ ఇచ్చి "హెల్లో ... హవ్ ఆర్ యూ? " అని అడుగుతారు. ఆ పలకరింపుతోనే పేషంట్ కి కొండంత ధైర్యం వచ్చేస్తుంది. మన బాధలన్నీ చాలా శ్రధ్ధగా వింటారు, మన యక్ష ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇస్తారు.    

ఈ మధ్యన మా ఫామిలీలో ఒకరికి అక్కడ బైపాస్ జరిగింది. ఇంతకు ముందు KIMS గురించి మాకు పెద్దగా తెలీదు. ఇంటర్నెట్ లో కూడా పెద్దగా రివ్యూస్ ఏమీ కనిపించలేదు. ఎప్పుడో ఏడాది క్రితం అత్యవసరం అయ్యి KIMS కి వెళదాం అనుకొని కర్డియాలజీ కి ఫోన్ చేస్తే ఆ టైముకి జివానీ గారు ఉండటం వల్ల ఆయన దగ్గరే కన్సల్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అప్పుడు మొదటి సారి వెళ్ళినప్పుడే అక్కద స్టాఫ్ మనకిచ్చే గౌరవం, వాళ్ళ సర్వీస్ అన్నిటికీ మించి జివానీ గారు కేస్ హాండిల్ చేసిన తీరూ అలా గుర్తుండిపోయి ఇక వేరే అలోచించకుండా ఇప్పుడూ అక్కడికే వెళ్ళాం.    
యాంజియోగ్రాం, బైపాస్ అన్నీ అక్కడే చేయించి ఏ కంప్లైంటూ లేకుండా, ఎక్కడా విసుగు అనేది కలగకుండా ఇంటికి వచ్చాం.

ఈ హాస్పిటల్ లో క్లీనర్ దగ్గర నుంచి పెద్ద surgen వరకూ అందరూ పేషంట్ కి గౌరవం ఇస్తారు.

సిటీల్లో చాలా హాస్పిటల్స్ లో స్టాఫ్ కూడా మనం చెప్పేవి వినేంత టైమూ, ఓపికా లేనట్టు ఉంటారు. అలాటి హాస్పిటల్స్ కు వెళ్ళి విసిగిపోయి ఇలా అరుదుగా కనిపించే డాక్టరు గురించి, ఈ హాస్పిటల్స్ గురించీ నలుగురికీ చెప్పాలనిపించింది. మిగతా డిపార్ట్మెంట్స్ గురించి నాకు తెలీదు కాని కార్డియాక్ సమస్యలకు మాత్రం రెండో అలోచన లేకుండా KIMS కి వెళ్ళొచ్చు అనిపించింది.





  

Saturday, January 15, 2011

మాయ చేసే మూన్నార్ ...

క్రితం వారం పెద్ద ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు అనుకుని మూన్నార్ వెళ్ళాం.


వెళ్ళేముందు కొద్దిగా రిసెర్చ్ చేస్తే కొచ్చి దారికన్నా కోయంబత్తూర్ దారి చాలా బావుంటుందని తెలిసి కోయంబత్తూర్ ద్వారా వెళ్ళాం.



కోయంబత్తూర్ నుంచి ఉడుమల్పేట్ దాకా వేడి వాతావరణమే ఉంటుంది. ఉడుమల్పేట నుంచి దారి ఎంతో అందంగా ఉంటుంది. కేరళా ని God's own country అని ఎందుకన్నారో మెల్ల మెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రయాణం అంత అద్భుతం. ఎత్తయిన కొండలమీదనుంచి మన బస్ వెళుతూ ఉంటే, మనం ప్రయాణించే దారికీ , పక్కన కొండలకీ మధ్యనున్న లోయలో సెలయేరొకటి మనతో పాటే పయనిస్తూ దారంతా కనిపిస్తుంది. బస్ కిటికీ లోంచి ఘాట్ రోడ్డు అంచులమీద కాపలాగా నించున్నా చెట్లమధ్యలోంచి ఆ సెలయేటిని వెతుక్కుంటూ ప్రయానించడం లో ఏదో గమ్మతైన హాయి.


ఆ దారిలో ఎన్నో చోట్ల ఇదే సెలయేరు అద్భుతమైన జలపాతంగా దర్శనమిస్తుంది. బండరాళ్ళమీంచి పాటపాడుకుంటూ వయ్యారంగా దూకే ఆ సెలయేటిని చూస్తున్నంత సేపూ ఇస్మాయిల్ గారి సెలయేరు కవితే మదిలో మెదిలింది.


" సెలయేరా సెలయేరా

గల గల మంటూ నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?



చూడూ ...

నా బ్రతుకు నిండా రాళ్ళు

పాడకుంటే ఎలా ... "



లోయలమధ్యలో అందమైన రహస్యాలని వెత్తుక్కుంటూ పచ్చటి ఆ ప్రకృతిలో మమేకమవుతుంటే మనసు చేసే ఏ అన్వేషణకో నిజంగా దేవుడి ఇంటికే వచ్చినట్టున్న ఈ ప్రకృతే ఆఖరిమెట్టేమో అనిపిస్తుంది.
 
మున్నార్ లో జనసాంద్రత చాలా తక్కువ. అందుకే అక్కడ ప్రకృతిని, ఆ పచ్చదనాన్నీ చాలా సహజంగా ప్రశాంతంగా ఆస్వాదించగలం.
 
మీ కోసం ఇంకొన్ని ఫొటోలు ....
 










Monday, September 27, 2010

మరొక్కసారి ..

చినుకై రాలిన మేఘాన్ని
ఆకాశం తిరిగి పొందినట్టు

కోల్పోయిన ఆత్మీయుల్ని
మనిషి పొందగలిగితే
ఎంత బాగుండును !!

మరచిపోయిన దారుల్లో
నది తిరిగి ప్రవహించినట్టు

గతకాలపు గుంటలోకి
వర్తమానాన్ని మళ్ళించగలిగితే
ఎంత బాగుండును !!

ఈ తీరం
ఇష్టంగా చేరిన గమ్యమే అయినా
అసంతృప్తితో జారిపోతున్న
ప్రతి క్షణమూ
సిగ్గుపడేలా

బాల్యాన్ని చూపించనూ !




Monday, September 13, 2010

వినాయక చవితి నాడు వచ్చిన కొత్త అతిథి

ఈ సారి గణేష్ చతుర్థి కి మా ఇంటికి వచ్చిన కొత్త అతిథిని చూడండి. మాతో పాటు బుధ్ధిగా కూచుంది అందాల డుంబో.



డుంబో గారి గురించి తెలీని వారికి , ఇది 1950 లో వచ్చిన డిస్నీ యానిమేషన్. అద్భుతమైన కేరెక్టర్. నాకెంతో ఇష్టం. :-) 

డుంబో అల్లరి చూడాలంటే ఈ లింక్ చూడండి.


http://www.youtube.com/watch?v=vviPULYfqpE

Monday, September 6, 2010

భీష్మ ...


నిన్న మధ్యాహ్నం ఎమీ తోచక ఛానెల్స్ మారుస్తుంటే, వెంకటేశ్వరా భక్తి ఛానల్ లో, పాత సినిమా భీష్మ వచ్చింది.   

ఒక పాత పౌరాణిక సినిమా చూసి చాలా కాలం అయిందని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది.

చాలా చిన్నప్పుడు ఈ సినిమాకి మేమంతా మా బామ్మగారితో కలిసి వెళ్ళాం. అప్పట్లో ఈ సినిమా చూడటానికి ముందే మా బామ్మగారి ఒళ్ళో కూర్చుని చాలా పురాణగాధలు వినేశాం. భీష్ముడు, అంబ, అంబిక, అంబాలిక ల కధలు కూడా. సినిమాలో బామ్మగారి పక్కన కూర్చుని ఇంతకు ముందు ఆవిడ ద్వారా విన్న కధే తెరపైన చూడటంలో అదో ఆనందం.

ఈ సినిమాలో "మహా దేవ శంభో .." అన్న పాట చిన్నప్పుడు పాడుకుంటూ ఉండేదాన్ని. నిన్న మళ్ళా అంబ శివుడిని గూర్చి తప్పసు చేసే ఘట్టం, ఈ పాటా చూస్తే కళ్ళ ముందు ఛానెల్ లో సాగుతున్న సినిమా కన్నా ఎప్పుడో ఇరవయ్యేళ్ళకు పూర్వమే బామ్మగారి ఒళ్ళో కూచుని ఈ కధ విన్న అనుభూతే మళ్ళా గుర్తొచ్చింది.

ఎంతయినా బాల్యం మొత్తం లో ఇలా తాతయ్యగారితోనూ, బామ్మగారితోను గడిపిన కాలం అమృతతుల్యం కదూ . 
 
నిన్న సినిమా పూర్తవుతూనే మహాదేవ శంభో పాట డౌన్లోడ్ చేసేసాను. ట్యూన్ కోసం కన్నా ఇది బామ్మగారితో కలిసి చూసిన పౌరాణిక సినిమాలోని పాట కదా అని వినడంలోనే ఎక్కువ ఆనందం కలుగుతోంది నాకు.   

Tuesday, August 3, 2010

మేఘం మనసారా నవ్వింది.

చిరు చీకట్లు కమ్ముకుంటుండగా పరుగు పరుగున వచ్చి ఆఫిసు బస్సులో కూచున్నాక, సెల్లు లో ఇళయరాజా మెలొడీ వింటూ కళ్ళు మూసుకున్నాను. రెండు క్షణాల్లోనే అనుకోని అతిధిలా మట్టి పరిమళం పలకరించింది. ఆశ్చర్యంగా కళ్ళుతెరిచి చూస్తే ఇంకేముంది? బస్సు అద్దాలమీద కేరింతలు కొడుతూ చినుకులు చిందులేస్తున్నాయి. 
 
ఎక్కడో మనసులో రేగుతున్న ఎదో అలజడి మనసులోనే కరిగిపోయింది. మనసారా మేఘం నవ్విన సవ్వడికి అలసటంతా ఎగిరిపోయింది.

దశాబ్దాలుగా వర్షాన్ని చుస్తున్నా, ప్రతిసారీ వర్షం కొత్తగానే ఉంటుంది కదూ ... :-)