Monday, December 16, 2013

నా ఏకాంతక్షణాలు
బరువైన క్షణాల్ని మోసి అలసిన పగటిని జోల పాడి నిద్రపుచ్చాక, నా కోసం మాత్రమే ఓ రహస్య వసంతం మేల్కొంటుంది.

గుమ్మం దగ్గరే, కలలు కుట్టిన చీర కట్టి, నిద్ర వాకిలి తడుతున్నా, అక్షరాన్ని ఆప్యాయంగా తడుముకుని ఎన్నాళ్ళయిందోనని ఙ్ఞప్తికొచ్చాక, నా గది గవాక్షన్నే ముందుగా తెరుస్తాను.

వెన్నెల తివాచీలు పరుస్తూ చంద్రుడూ, పన్నీరు జల్లుతూ చల్ల గాలీ నా వెనుకే వస్తారు.నా అడుగుల సవ్వడి వినపడగానే ఆ పూదోట మెల్లగా విచ్చుకుంటుంది.

ఎందుకో మరి, అలిగి విరిగి పడ్డ మబ్బు తునకలు, దారంతా కాళ్ళ కింద నలుగుతూ ఎదురుచూడని ఏ రాగాన్నో అస్పష్టంగా గుణుస్తున్నట్టున్నాయ్.

ఎప్పటి ఉద్వేగానికో ఇప్పుడు పదాల్ని సమకూర్చుకుంటూ ఇక్కడొక చలిమంట వెయ్యాలనుంది.  చీకటీ , నిశ్శబ్దం సంగమించే సమయం ఎంత అపురూపం?   కీచురాళ్ళ భాష తెలిస్తే రాయలేనన్ని పదాలు దొరికేవేమో.


చంద్రుడినుంచి ఒకే ఒక్క కౌగిలి పుచ్చుకున్న స్ఫూర్తితో ఎక్కడున్నా వెలిపోయే మబ్బు తునకలాగో,

అడవి నుంచి ఒకే ఒక్క రంగుని తీసుకుని గాలిలో విలీనమవుతూ సాగిపోయే పాట లాగో

నువ్వన్న ఒకే ఒక్క మాట, కొన్ని వేల ప్రతిధ్వనులుగా విడిపోయి, వెచ్చటి ఊపిరి లోంచి బయటికొస్తూ అదో రకమైన మత్తులో నన్ను ఓలలాడించిన ఙ్ఞాపకమొకటి నా ముంగురులు సవరించి వెళ్ళిపోతుంది.క్షణాలన్నీ నన్నే ఎత్తుకుని లాలించే ఈ అద్వితీయమైన ఏకాంతం కోసమే పగలంతా ఎదురు చూస్తాను.  కొన్ని అరుదైన పూరేకుల్ని దోసిట దొరకపుచ్చుకుని సంతృప్తిగా  నా గది గవాక్షం వైపు సాగిపోతాను.

(డిసెంబర్ 12 సారంగ ఈ పత్రిక లో ప్రచురితం )

Wednesday, December 4, 2013

చెవుల్లో అమృతం

అచ్యుతాష్టకం అంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. అయితే ఎప్పుడైనా పుస్తకంలో చూసి చదవడమే కానీ ఆడియో వినే ప్రయత్నం చెయ్యలేదు. ఈ మధ్య యు ట్యూబ్ లో వెతికితే 'ఆచ్యుతాష్టకం బై యేసుదాస్ ' అన్న లింకు వచ్చింది. ఇంకేముంది? యేసుదాసు గొంతులో అచ్యుతాష్టకం వింటుంటే నిజంగా చెవుల్లో అమృతం పొయ్యడమంటే ఏమిటో అనుభవంలోకొచ్చింది. పదాల్లోని మాధుర్యాన్నంతా గొంతులో ఒంపుకొని శ్రోతల్ని భక్తి భావం లో ముంచేస్తున్నాడు. అప్పటి నుంచీ రోజుకి ఒక్కసారైనా వినకుండా ఉండలేకపోతున్నాను.  

మీరూ వినాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి మరి.  

http://www.youtube.com/watch?v=kFpVxy6jNPM 

Wednesday, October 30, 2013

ఎదురుచూపు
పుడమి నేర్పిన రాగాలన్నీ
ఎక్కడి దాహార్తుల మీద కురిపించడానికో
ఈ మేఘాలన్నీ గుంపుగా కదిలి పోతున్నాయ్.

ఒక్క పల్లవినైనా ఇక్కడ జారవిడిస్తే బాగుణ్ణు
లోపలొక ఉప్పెనొచ్చి
హృదయాన్ని ప్రక్షాళించి వెళుతుంది

Friday, October 18, 2013

ఒక్కసారిగా ఎంత వెన్నెల - 1

 
 
 
 
చీకటి...చీకటి...
మండుటెండలో సైతం 
మనసు ఖాళీల్లో నిండిపోయిన చీకటి.   
పొద్దు వాలినా
ఒక తేడా తెలీని తనంలోంచి
నిర్నిద్రతో
క్షణాలన్నీ నిస్సహాయంగా మండిపోయాక  
నిరాశగా పడున్న
చందమామ పుస్తకంలోంచి 
వన దేవతో దయ తలచి వస్తుంది.
నొప్పి కళ్ళలో
కలను పిండి
తన చేత్తో కళ్ళు మూస్తుంది
 
చీకట్లను చేదుకుంటూ
పొగ బండి దూసుకుంటూ పోతుంది.  
 
ఎదురుగా ... 
ఆకాశమంతా పరుచుకున్న చంద్ర బింబం 
ప్రతి దిక్కులోనూ ప్రతిఫలిస్తూ
దోచుకోలేనంత వెన్నెల ... 
సుడిగుండంలా ఉక్కిరి బిక్కిరి చేసాక
సాయం చెయ్యలేనని
భాష చేతులెత్తేసాక 
చేసేందుకేముంటుంది !
కవిత్వీకరించాలనే అలోచనలన్నీ 
ఒలిచిపారేసి 
ఒక్కసారి  
వెన్నెల సముద్రంలో
నాలోని నన్ను
కడిగేసుకోవడం తప్ప!  

Tuesday, October 8, 2013

ఈ సారైనా ...

ఈ సారైనా వెన్నెల శాలువా కప్పుకుని, నీ చెంత కాసేపు కూచోవాలనుకున్నాను. నీ చల్లటి చేతులతో నా పాదాలు నిమురుతూంటే, మెరిసే నీ కంటి వెలుగుల్నీ, నీ నవ్వుల్లో గల గలల్నీ లెక్కించుకుంటూ గడపాలనుకున్నాను. అలసిపోయిన ఆకాశం చీకటి చీరలో ముగ్ధంగా మత్తిల్లే వేళ, అదే రంగు చీరలో నువ్వు ఆకాశపు వెన్నెల మనసుని ప్రతిబింబిస్తూంటే మాయమైపోయిన జీవితాన్ని ఇక్కడ కాసేపు దర్శిద్దామనుకున్నాను. ఇలా ఓ కొబ్బరాకునైపోయి వేళ్ళసందుల్లో వెన్నెల బలపాలు పట్టుకుని గీసుకునే పిచ్చి గీతలు నీ చీరకుచ్చిళ్ళలోంచి జారిపోతుంటే, కిలా కిలా నవ్వుతూ చిరుగాలితో చెయ్యి కలిపి చప్పట్లు కొట్టాలనుకున్నాను. నీ కబుర్లతో తడిసిన దోసెడు క్షణాల్నీ ఘనీభవింపజేసి, గుండె పొదరింట్లో దాచుకోవాలనుకున్నాను.
కానీ ఎప్పటిలాగే, ఏకాంతంగా నీ చెంత కూచోలేని నిస్సహాయతను నిందించుకుంటూ నిష్క్రమిస్తున్నాను.

 

Friday, September 20, 2013

పునర్నిర్మించలేని వాసనలు

కొన్ని వాసనలు జీవితంలో ప్రత్యేకమైన ఙ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని పునర్నిర్మించే ప్రయత్నం ఎప్పుడూ విఫలమే.
చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకీ అత్తయ్యల పిల్లలు అందరూ వచ్చేవారు. అందరం కలిసి పెరట్లో నారింజ చెట్టుకిందో, పనస చెట్టు కిందో మట్టి ఇళ్ళు కట్టుకుంటూనో, పూల తోటలు నాటుకుంటూనో ఉండేవాళ్ళం.

ఒకసారి తిరుణాళ్ళలో కొన్న మట్టి పాత్రలు పెట్టుకుని పెరట్లో నారింజచెట్టు కింద ఆ చిన్న పొయ్యి మీదే ఒక మట్టి కుండ పెట్టి, పెరట్లో మేము నాటితే పెరిగిన ఉల్లి కోళ్ళు (స్ప్రింగ్ ఆనియన్ ) ని తరిగి , పులుసు పెట్టాం. పెరట్లో కింద పడిన చిన్న చిన్న ఎండు పుల్లలు అన్నీ పేర్చి ఆ చిన్న పొయ్యి వెలిగించి , ఆ మట్టి పాత్రలో బావిలోంచి తోడి తెచ్చిన నీళ్ళు పోసి , ఉళ్ళికోళ్ళ ముక్కలు వేసి వంట చేస్తూ మేమే ఓ చందమామ కధ నడుపుతున్నంతగా ఆనందించేసాం. ఆ పులుసు మరుగుతున్నంతసేపూ ఆ ప్రాంతమంతా ఎంత మంచి వాసనో చెప్పలేను. ఇప్పటికీ ఆ వాసనెప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

కొన్ని ఙ్ఞాపకాల్ని ఎప్పటికీ పునర్నిర్మించలేమని తెలిసే ఇన్నాళ్ళూ ఎందుకో మరలా ఆ పులుసు వండే ధైర్యం చెయ్యలేకపోయాను. అయితే ఈ మధ్య మాత్రం ఎందుకో ఆ వాసన మరీ మరీ వెంటాడీ ఒక రోజు స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకుని చాలా ఉత్సాహంగా చేసాను. మంచి వాసనయితే వచ్చింది కానీ ఏ కోశానా , గుండె పొరల్లో నిక్షిప్తమైపోయిన ఆ వాసనకి సరి కాలేకపోయింది నా వంట.

మరి అప్పటి ఙ్ఞాపకంలో ఉన్న నారింజ చెట్టు, పెరటి ఉల్లికోళ్ళూ, ఆ మట్టి పాత్రలూ, బావి నీళ్ళూ, అన్నిటికీ మించి ఆ స్వచ్చమైన పసితనమూ అన్నీ ఇప్పుడు కొరతే కదా.   

Thursday, August 8, 2013


A painting of Radha Krishna . Acrylic on Canvas.

Wednesday, July 31, 2013

పాపతో ...

ఆకాశంలో ఒద్దిగ్గా కూచుని
కారు మేఘాలన్నీ
చినుకు బలపాలతో
నేల మీద అక్షరాభ్యాసం చేస్తున్నాయి. 

ప్రతి అక్షరం నుండీ
ఒక పువ్వు పూసి 
వృత్తంగా మారి
అనంతంగా విస్తరిస్తోంది.

ఙ్ఞాన పుష్పం విచ్చుకుంటే
బ్రహ్మాండం కనిపిస్తుందని
చూపించడం కాబోలు!

తర్కానికీ తత్వాలకీ అందని
ఒకానొక ఆనందస్థితిలో 
పదే పదే ఆ నీటిని పొడుస్తూ
ఓ పిట్ట...
కేరింతలు కొడుతూ మా పాప... 

ఇంతకన్నా ఏం కావాలి!

Monday, July 15, 2013

వాన

అదే వాన చిత్రం
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే
పచ్చని చేత్తో నిమురుతుంది.

ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.

వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.

ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.

నింగీ, నేలా ...

నా ఎదురుగానే ఉంటావ్
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం
అడ్డు మేఘాలు కరిగిపోడానికి
నా స్పర్శే కాదు
నీ వేడి నిట్టూర్పులు కూడా
చాలటం లేదు
ప్రవహించే ఏ నదయినా
ఒక్క క్షణం ఆగి
నా పాట కూడా వింటుందని
ఆశగా చూస్తూంటాను
ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
తన రెక్కల నీడ పడుతుందని
నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.
నీకోసం
రంగుల ముఖాల్ని తొడుక్కుంటూ
నీ మనసుకి అద్దంలా మారిపోతూ
అమృతాన్ని వర్షిస్తూ
నేనూ  …
నాతో మాట్లాడాలని
సుడులు తిరుగుతూ
పచ్చటి సైగలు చేస్తూ
పూలను విసురుతూ
గాలిపైటనాడిస్తూ
అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ
నువ్వూ …
పరస్పరం ప్రేమించుకోని క్షణముండదు
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం ….

Monday, July 8, 2013

బాల్యం తిరిగొచ్చింది

ఎన్నేళ్ళ క్రితమో
నిర్దయగా నన్నొదిలిపోయిన బాల్యం
ఇవాళ నీ మెత్తని అరచేతిలోంచి
తిరిగి నాలోకి ప్రవహిస్తోంది.

నా వేలు పట్టుకుని నువ్వు నడిపిస్తుంటే
నిన్న అడుగులు నేర్చుకున్న నీ దగ్గర
ఇష్టమైన దారిలో నడవడం
ఇప్పుడే నేర్చుకుంటున్నాను.

చిట్టి చిట్టి పదాలు నీకు నేర్పుతూనే
నానార్ధాలకో విపరీతార్ధాలకో బెదరడం మానేసి
భావాలకి రెక్కలిచ్చి
పెదవులపైకి ఎగరేయడం నేర్చుకుంటున్నాను.

అంతర్జాలంలో వలేసి
నీకోసం కొన్ని ఆటల్ని పట్టుకుంటాను కానీ
నువ్వు నాకు నేర్పే ఆటలాడాక
నింగి తారల్ని చూసి
విద్యుద్దీపాలెందుకు తలొంచుకుంటాయో
తెలుసుకుంటున్నాను.

అందరూ అన్నివైపులా చేరి
స్వేఛ్ఛగా పెరిగిన కొమ్మాలన్నీ నరికేసినా
చిటారుకొమ్మన పూసిన పుష్ప మాధుర్యంతోనే
చెట్టు పరిమళించినట్టు
నీ నవ్వుల్లోనే
నేను విరబూయడం నేర్చుకుంటున్నాను.

ఆకాశపు వెలుగునంతా
సాయంకాలానికల్లా ఏరుకొచ్చి ఒకచోట కుప్పగా పోస్తే
ఏ అల్లరి మబ్బో
ఆ వెన్నెల కుప్పని భళ్ళున ఒలకబోసినట్టు
నీ చేష్టలు
నా జీవిత పుస్తకంలో ప్రతి కాగితం లోను
వాడని పూలుగా పేర్చుకుంటున్నాను.

యవ్వనానికీ తిరిగొచ్చిన బాల్యానికి మధ్య
శత సహస్ర రహస్యాల దూరాన్ని
కొంటె చూపుతోనే చెరిపావో
తప్పటడుగులోనే కొలిచావో కానీ
నేను నీకు అమ్మనో
నువ్వే నాకు అమ్మవో తెలీని సందిగ్థావస్తలో
నా పెద్దరికమంతా
సెలయేట్లో కురిసే వాన చినుకైపోయింది.

( ఈ కవితకు NATS 2013  కవితల పోటీలో మూడవ బహుమతి లభించింది)

Monday, May 20, 2013

వేసవి…

ఉదయ పుష్పం
రేకులు విచ్చుకుంటూ
కిటికీలోకి తొంగి చూస్తుంది.
ఆకాశం పారేసుకున్న పాత ఉత్తరాలు
చెల్లా చెదురుగా కనిపిస్తాయ్
వాటిలోనే ముఖం పెట్టి
నా నిద్రని తుడుచుకుంటాను. 


కాలం దాచేసుకున్న వాసనలేవో
వేసవి గాలితో చెయ్యికలిపి
ప్రేమగా పలకరిస్తాయేమో
లిప్తకాలం రెప్పలకింద
ఆ పాత నేను 


అంతలోనే
అల్లరి బాలుడిలా సూర్యుడు
నారింజ చొక్కా విప్పి చెరువులో విసిరేసి
నింగివైపు పరుగుదీస్తాడు 


బధ్ధకాన్నొదిలిన చెట్లకూ, చిలుకలకూ
గడియారపు మెటికల విరుపులకూ
ప్రేరణనిస్తూ
తత్వవేత్తలా ఆకాశం
గంభీరంగా మారిపోతుంది.

Saturday, April 20, 2013

శిశిరంలో అకస్మాత్తుగా...

ఆకాశ పుష్పమొకటి విచ్చుకుని
ఫక్కున నవ్వినట్టుంది.

ఇన్నాళ్ళుగా అది దాచుకున్న
ఎక్కడెక్కడి సుందర దృశ్య వీక్షనానుభూతులో
ఇక్కడ తేనెజల్లై కురుస్తూ...

జోరు వాన
మువ్వల సవ్వడి వింటూ
ధ్యాన ముద్రలో ఈ క్షణాల్ని
తనువారా శ్వాసిస్తుంటే

మనసు మళ్ళీ విచ్చుకుంది. 

(పాలపిట్ట మార్చ్ 2010 మాసపత్రికలో ప్రచురితమయింది)

Friday, April 19, 2013

గుప్పెడు పూలు

ఎండిన రెప్పలపై
తడి మబ్బొకటి పరుచుకుంటుంది...
విసుగెత్తిన గుండెలో
చినుకుల సవ్వడి.
నా దారుల్లో ముద్రలేస్తూ
పసిపాదాలు నడుస్తున్నప్పుడు...
గుప్పెడు పూలు
గదినిండా వికసిస్తాయి.

Tuesday, February 12, 2013

ఙ్ఞాపకాలు ....

గోడమీది పటాలు పకపకా నవ్వినప్పుడైనా
నదిలా తప్పుకుని పోవడం మానేసి
సుడిగాలిలా కాలాన్ని తవ్వుకోవాలి

వేళ దాటి నిద్రించే ప్రతి మొగ్గనీ
సూటిగా ప్రశ్నించే కాంతి రేఖకు మల్లే
మనకే తెలీని మన లోపలి మూలాల్ని వెతికిపట్టి
నిత్య వసంతాన్ని చూపిస్తాయ్
ఙ్ఞాపకాలు ....

లేత పవనాలు

చపాతీ వత్తే చేతులు
గాజుల గల గలలు

మాల కట్టే
వేలి కొసలతో
పూల గుస గుసలు

పూ పెదవుల్ని
తుమ్మెద ముద్దాడినపుడు
పిట్టలై ఎగిరే పుప్పొడి రాగాలు

లిఫ్ట్ లో దొరికే
లిప్త కాలపు ఏకాంతంలో
గుండెలో చినుకుల చప్పుళ్ళు ...