Friday, August 22, 2014

కాసేపలా …

కొన్ని దారులంతే, వద్దన్నా పూల వాసనలు వెంటపడతాయ్. భావాల్ని పోల్చుకోమని సవాళ్ళు విసురుతూ, పిట్టలు అవే పాటలు తిరిగి తిరిగి పాడుతూంటాయ్. ప్రయత్నించినా నిమ్మదించలేని నడకలో అక్కడక్కడా పరిచయమయ్యే మంచు బిందువులు, లేత ఎండలో కరిగిపోతాయనుకుంటాం. కరిగిన బిందువులన్నీ మట్టిలో నిద్దురోతూనే కొన్ని రహస్యాల్ని పలవరిస్తాయ్.

నడుస్తూనే ఈ దారంట, నాలుగు నవ్వుల్ని నాటి పోవాలి. ఆ నవ్వులెదిగి పూలు పూసి, గాలికి ఊగేప్రతిసారీ , తన నీడలో నడిచిపోయే వారి పైన మధువు చిలకాలి. ముల్లు దిగిన నొప్పి కన్నా, పూల స్పర్శని పంచుకోవడమే నాకిష్టం.

గుండెలో ఏ మూలో ఓ చిన్న పొదరిల్లు అల్లుకుని కూచుంటావని తెలుసు నాకు. సెలయేటి పాటలైతే బావుంటాయి కానీ , సముద్రపు హోరెందుకు నీకు? అందుకే , ఆ సముద్రానికీ, ఆకాశానికీ ఓ పందెం పెట్టి వదిలేశాను. ఇక నీ దాకా రాదు హోరు. 

అవును మరి. నా మాటల్ని వింటూనే కోసిన మల్లెమొగ్గల్ని హటాత్తుగా నా ముఖం మీదకి విసిరినప్పుడు, అవి విచ్చుకుని కిందకి జారుతుంటే, నీ కళ్ళలో కనపడే విస్మయాన్ని చూసి ఎన్నేళ్ళయిందని? కాసేపిలా నా పక్కన కూచుని చందమామని చూసేంత సమయముందా? నీ కళ్ళలో ప్రతిఫలించే వెలుగులో దీపించే క్షణాల ద్వారానే నా దారి నేను తెలుసుకోవాలి.

నీ మాటలు...

ఎక్కడి పూసినవో
నీ మాటల ప్రవాహంలో
కొన్ని వేల పూరేకలు

ఏ ప్రయాణంలోనైనా పరిమళించగలగడం
వాటి నుంచే నేర్చుకుంటున్నాను

కొన్ని పాటల్ని
దాటి పోవాలనిపించనట్టే
నీ మాటల్ని కూడా

తడవ తడవకీ ఇలా
తడిసిపోనీ

Tuesday, August 12, 2014

అడవిలా …

అడవి మనసుని
కొంతయినా అర్థం చేసుకోవాలి
మొరటు చెట్టుని  ప్రేమగా హత్తుకునే తీగల్లాగో …
సెలయేటి ఒంపుసొంపులన్నీ సొంతమైనా
మోహాన్ని కనపడనివన్ని బండరాళ్ళలాగో …
కాసేపు మారిపోవాలి.  
 
 
అడవి అందాన్ని
కాసేపైనా అరువు తెచ్చుకోవాలి.
ఇన్నేసి ఉదయాల్ని
అద్భుతంగా చిత్రిస్తున్న కిరణాల కుంచెల్ని
ఒడుపుగా పట్టుకున్న ముని వేళ్ళకి
మనసారా మ్రొక్కి రావాలి 
 
అడవి స్థితప్రఙ్ఞతని
కాస్తయినా అలవర్చుకోవాలి
కాలం ప్రతి ఋతువునీ దోచుకుని
కౌగిట్లో కరిగించేస్తున్నా
నిరాశ నీడల్ని తరిమికొట్టే
నిబ్బరత్వాన్ని పొందాలి.  
 
అడవి వినయశీలతని
ఇనుమంతయినా నేర్చుకోవాలి.
రాత్రి చెప్పిన పాఠాలు విని 
ఆత్మ పరిశీలన చేసుకుంటూ
మలి ఉదయానికి
నన్ను నేను పునర్నిర్మించుకోగలగాలి.
తిరిగి తిరిగి పాడుతున్న
వెలిసిపోయిన పాటల్ని
ఇవాళ బహిష్కరించి
కాసేపయినా …
అడవిలా ఆకుపచ్చగా పాడుకోవాలి.       

Monday, August 11, 2014

కొందరుంటారు…


సముద్రాలకావలెక్కడో, నారింజరంగు ఆకుల మధ్య, దోబూచులాడుతున్న కవితల్ని వెతుక్కుంటూనో, అడుగుమందాన కట్టిన మంచుని భావాల మునివేళ్ళతో పెకలిస్తూనో, అదీ కాకుంటే, మంచుని కప్పుకున్న ఇంట్లో, ముడుచుకుని కూర్చుని, కవిత్వంతో చలి కాచుకుంటూనో ...     

ఒక్కోసారి నిద్రని రజాయి కప్పి జోకొట్టి, బరువెక్కిన రెప్పల్ని తెరిచి పట్టుకున్న పదచిత్రాల వెలుగులో, అక్షరాల మాలికలల్లుతూనో, నింగి రాలుస్తున్న రవ్వల్ని శ్రధ్ధగా సేకరించి తెల్లకాగితానికి అలంకారాలద్దుతూనో...     

వాళ్ళెలాగో..., వసుంధరా సౌందర్య సేవనానుభూతిని మోయలేక, ఆకాశమెప్పుడో భళ్ళున బ్రద్దలైనప్పుడు,, వెన్నెల తరగల్లో కలిసిపోయి శ్రవిస్తున్న భావోన్మాదాన్ని ఒడిసిపట్టుకుని, కలంలో సిరాగా నింపుకుంటారు.  కోటి పువ్వులు వికసించే ఒకే ఒక్క క్షణాన్ని నిశ్శబ్ద రేయి నుంచి వేరు చేసి, సంతకానికి చివర చుక్క పెడతారు.    

వాళ్ళంతే. అందర్నీ ప్రేమిస్తారు. అందుకే కవితని ప్రపంచపు వివర్ణపు మనసు మీదకి ఎగరేస్తారు. గాల్లో తేలుతూ ... నింగి నుంచి మనసుకి సప్తవర్ణాల వంతెనలేస్తూ  .... అందుకోవాలే కానీ,  చేరుకోలేకపోతున్న లోపలి ద్వీపానికిప్పుడు స్పష్టమైన దారి పడుతుంది. నేనెక్కడో తప్పిపోయాననుకుంటాను కానీ, నన్ను నేను ఇక్కడే చూసుకోవడం గమ్మత్తుగా ఉంటుంది.        
(మొదటి ముద్రణ ఆటా 2014 ప్రత్యేక సంచిక 'అక్షర ' లో  )