Thursday, September 25, 2014

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

 
 
నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా, ఏదో భావాన్ని భాషతో చిత్రించలేకపోయినట్టు, నీ వెనుక గిరికీలు కొడుతూ మేము చల్లే వెలుగుల్ని తూచలేరెవ్వరూ.
ఎక్కడిదో మంచు మల్లెపూలుగా మారి చారెడేసి కళ్ళలో చలువ పందిళ్ళు వెయ్యడం, ఒక్క వాన చుక్క వెయ్యి వాక్యాలుగా విడిపోయి, మనసు పల్లాలోంచి జారి గుండెలో ఊట బావిగా స్థిరపడటం, ఎక్కడ విరిసిన పూలో గుండె గోడల మీద ఆడుకోవడం, ఇప్పుడిక్కడున్నవాళ్ళందరూ అనుభూతిస్తారు.
అదిగో, విశ్వసంబరాల్ని సంధ్య ప్రమిదలోకి జార్చి, ఆకు కొసల్ని వెలిగిస్తోంది చూడు వెన్నెల. రెక్కలింక ముడుచుకుని, గూటికి తిరిగి చేరేముందు వెన్నెల్ని చుట్టేసి పట్టుకెల్దాం మర్చిపోకేం.
 
(మొదటి ముద్రణ 25-09-2014 సారంగ పత్రికలో )

Sunday, September 7, 2014

అమ్మ , పాప (పెయింటింగ్ )నేను ఈ మధ్యనే వేసిన పెయింటింగ్. gsm 200 Acid free పేపర్ మీద వాటర్ కలర్స్

సమయాన్ని స్వార్థంగానే ....

రాత్రి గొంతులోకి మధు ధారలొలికే వేళల్లో, నిశ్శబ్దానికి చెవి ఆనించి, మొగ్గలు మాటలు నేర్చుకోవడాన్ని వినాలని ప్రయత్నించేవాళ్ళం గుర్తుందా? మన పాట్లు చూసి వెన్నెల విరగబడి నవ్వినా, కాలాన్ని ఆ చివరా , ఈ చివరా కత్తిరించి అనిర్వచనీయమైన ఈ కక్ష్యలోనే మనం తిరగాడేలా చెయ్యాలని విశ్వప్రయత్నం చేసేది.

నువ్వలా ఆకుపచ్చగా కనపడితే నేను మరిన్ని నీల కాంతుల్ని విసరగలనంటూ, ఆకాశం తన వాన వేళ్ళతో వృక్షాల తల నిమిరినప్పుడు, ఆ ప్రేమ ధారల్ని తనలో నింపుకుంటున్న మట్టి దేహపు వాసనలు వంటబట్టించుకోవాలని పాల బుగ్గలమీద మట్టి ముగ్గులు పెట్టుకునేవాళ్ళం. ఙ్ఞాపకముందా. మట్టి తెగ మురిసిపోతూ చిట్టి చిట్టి పచ్చటి తాయిలాలు చూపిస్తూ నవ్వేది.


కాలానికి మనసులేకపోతేనేం? మనకున్నదెందుకు? అప్పుడప్పుడైనా, కాలాన్ని స్వార్థంగా సొంతం చేసుకోవాల్సిందే. మనసైన వాళ్ళ ముంగిట్లో కూచుని, ఙ్ఞాపకాల్నో, అనుభూతుల్నో, ఏవీ లేకపోతే ఆరాధన నింపుకున్న నిశ్శబ్ద క్షణాల్నో దోసిళ్ళతో తోడుకుంటూ ఒక్కసారి ఒడినింపుకుని చూద్దామా... పారిజాతాల గుండెల్లో చిక్కుకున్న మంచు బిందువులన్నీ ఒక్కసారిగా బయటపడి, పరిమళ కావ్యాలు పరిచయమవుతాయ్.