Sunday, July 25, 2010

మనసు వాకిట

ఇంతసేపూ

నాకు నేనే వినిపించని
కంప్యూటర్ బాహుబంధాల్లోంచి
వెలుపలకి వచ్చేసరికి

ఎంతసేపుగా
తలుపు తడుతోందో
జడివాన

చెక్కిలి చట్టుక్కున
ముద్దాడుతూ
దూసుకొచ్చింది.

ఇక మనసంతా సందడి.

Saturday, July 17, 2010

మనసుకీ కొంచం సమయం వెచ్చించండి.

ఉరుకుల పరుగుల జీవితం. సిటీ లో ఉంటే మరీనూ. ముఖ్యమైన పనులు చెయ్యడానికి కూడా సమయం చాలని పరిస్థితి. ఎంత బిజీ అయినా మనలో ఒక మనసుంది కదండీ. అది సంతోషంగా ఉంటేనే మనమూ సంతోషంగా పనులు చేసుకునేది. కదా ...


ఏ వయసు వాళ్ళయినా, ఉద్యోగం చేసేవాళ్ళయినా, ఇంటిపట్టున ఉండేవాళ్ళయినా ఎవ్వరైనా ప్రతి రోజూ కాసేపు మీ మనసుకి కొంచం మీ సమయం ఇవ్వండి. కాసేపు స్థిమితంగా కూర్చుని, దేనిగురించీ అలోచించకుండా మీ శ్వాస ని గమనిస్తూ మీ మనసునీ తద్వారా శరీరాన్నీ శాంతపరచండి. సింపుల్ .. మీ వయస్సు ఎంతో అన్ని నిముషాలయినా రోజూ ఎదో ఒక సమయంలో ఇలా చేసి చూడండి. కొత్తలో ఏ అలోచనలూ లేకుండా కూర్చునేది కష్టం అనిపించొచ్చు. సెకెన్ల వ్యవధి లోనే మళ్ళా వేరే అలోచన మనసులోకి వచ్చెయ్యొచ్చు. అయినా మళ్ళా దాన్ని దారిలోకి తీసుకురండి. కాసేపు మెదడు, మనసు, శరీరం అన్నిటికీ విశ్రాంతి. ఇప్పుడే అలోచనలకూ తావులేదు అనుకుని ప్రయత్నించండి.

కూచునో లేక చాలా విశ్రాంతిగా పడుకునో ఇలా చేసి చూడంది. మీ మనసు ఎంత సంతోషపడుతుందో, ఆ కాస్త సమయం ఇచ్చినందుకే మీ మీద కృతఙ్ఞతతో నిండిపోయిన మనసు మీకెంత శక్తినిస్తుందో గమనించండి. ఆ తర్వాత ఏ పని చేసినా హాయిగా చెయ్యగలం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ అలవాటు చేసుకుంటే మీలో మీకే కొత్త శక్తి కనపడుతుంది.



అలా కూర్చోడం మా వల్ల కావట్లేదు అంటారా ? నిజంగా ప్రయత్నించాలి అనుకునేవాళ్ళకి కొన్ని చిట్కాలు.



1. రోజులో ఎదో ఒక సమయంలో కాసేపు పచ్చటి మొక్కలనో, పువ్వులనో గమనించండి. పూర్తిగా దృష్టి వాటిపైన పెట్టండి. ప్రకృతి అందాల్ని ఆశ్వాదించండి.



2. మీ ఇంటి మిద్దె పైకి వెళ్ళి నిర్మలమైన ఆకాశాన్ని చూడంది. చూస్తూనే మీ శ్వాసని గమనిస్తూ ఉండండి.



3. చల్లటి గాలి వీచినప్పుడో, ఏదైనా అందమైన చెట్టునో, పూలనో చూసినప్పుడో తనువారా , మనసారా వాటిని ఆస్వాదించండి.



ఇవన్నీ కూడా మనసుని తట్టిలేపే సాధనలు. ప్రయత్నించి చూడండి.

Thursday, July 8, 2010

ఆక్టోపస్ బాబా ??

కొన్ని రోజులుగా వార్తల్లో దర్శనమిస్తున్న ఆక్టోపస్ బాబా ని చూశారా ?

ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ ఆక్టోపస్ వయసు రెండేళ్ళు. ప్రస్థుతం జెర్మనీ లో సీ లైఫ్ ఎక్వేరియం లో రాచమర్యాదలు అందుకుంటోంది.



ఇంతవరకు ఆరు జెర్మన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఆటల్లో, ముందుగానే ఎవరు గెలుస్తారు అనే జోస్యం చెప్పేసిందిట.



ఆక్టోపస్ బాబా చేత ఇది చెప్పించడం కోసం జెర్మన్లు రెండు బాక్సులు అది ఉన్న ఎక్వేరియం లో పెడుతున్నారు. ఒక దాంట్లో జర్మన్ జాతీయ జెండా, మరొక దాంట్లో జెర్మన్ తో ఆడుతున్న దేశపు జెండా పెడుతున్నారు. ఈ బాబా కొంత సమయం తీసుకుని , రెండింట్లో ఒక బాక్సు మీద కూచుంటోందిట. ఆటలో ఖచ్చితంగా ఆక్టోపస్ ఏ దేశం పేరున్న బాక్సు మీద కూచుందో ఆ దేశమే గెలుస్తోంది.



ఎంత చిత్రం గా ఉంది కదూ …

ఎప్పుడూ గోల గోల గా విసుగెత్తించే వార్తా ఛానళ్ళలో ఈ ఆక్టోపస్ వార్త వింటుంటే, ఎడారిలో చిరుజల్లు కురిసినట్టు లేదూ ?



నాకయితే భలే సంబరం గా, ముచ్చటగా అనిపించింది ఈ ఆక్టోపస్ ని చూస్తే. చిన్నప్పుడు తతయ్యగారి దగ్గర కూచుని కథలు చెప్పించుకున్న రోజులు, చందమామ కథలు చదువుకున్న రోజులు వెనక్కి వచ్చినట్టు అనిపిస్తోంది. ఒక్కసారిగా ఆ అందమైన రోజుల్లోకి తిరిగి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతోంది ఒక రెండు మూడు రోజులుగా ఇంట్లో ఈ ఆక్టోపస్ గురించి మాట్లాడుకుంటుంటే.



ఎన్ని కథలు అల్లుకొవచ్చు కదూ ? ఒక మంచి చందమామ కథగా మలచుకోవచ్చు.



ఇంట్లో అందరం కలిసి మాట్లాడుకునేది కాసేపే అయినా, ఇలాటి ముచ్చటైన విషయాల కోసం వెచ్చించేది గుప్పెడు క్షణాలే అయినా మనసుకి instant energy ఇచ్చే ఇలాంటి విషయాలని మూటగట్టుకునే ఆ గుప్పెడు క్షణాల్లో ఎంత జీవం !!



ఈ వార్తలో నిజమున్నా లేకున్నా, వినడానికి మాత్రం మంచి కబురు కదూ...

Thursday, July 1, 2010

మర్మం

రాలే పువ్వు
రహస్యపు కన్నీరు...

కరిగిపోయే మేఘం
చివరి సూక్తుల చినుకులు...

వలసపోయే కిరణం
చీకటి గుసగుసలు...

అర్థం కానివో
అర్థం లేనివో
నిదుర జారేవేళ
నా గుండె చప్పుళ్ళు.