Wednesday, July 31, 2013

పాపతో ...

ఆకాశంలో ఒద్దిగ్గా కూచుని
కారు మేఘాలన్నీ
చినుకు బలపాలతో
నేల మీద అక్షరాభ్యాసం చేస్తున్నాయి. 

ప్రతి అక్షరం నుండీ
ఒక పువ్వు పూసి 
వృత్తంగా మారి
అనంతంగా విస్తరిస్తోంది.

ఙ్ఞాన పుష్పం విచ్చుకుంటే
బ్రహ్మాండం కనిపిస్తుందని
చూపించడం కాబోలు!

తర్కానికీ తత్వాలకీ అందని
ఒకానొక ఆనందస్థితిలో 
పదే పదే ఆ నీటిని పొడుస్తూ
ఓ పిట్ట...
కేరింతలు కొడుతూ మా పాప... 

ఇంతకన్నా ఏం కావాలి!

Monday, July 15, 2013

వాన

అదే వాన చిత్రం
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే
పచ్చని చేత్తో నిమురుతుంది.

ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.

వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.

ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.

నింగీ, నేలా ...

నా ఎదురుగానే ఉంటావ్
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం
అడ్డు మేఘాలు కరిగిపోడానికి
నా స్పర్శే కాదు
నీ వేడి నిట్టూర్పులు కూడా
చాలటం లేదు
ప్రవహించే ఏ నదయినా
ఒక్క క్షణం ఆగి
నా పాట కూడా వింటుందని
ఆశగా చూస్తూంటాను
ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
తన రెక్కల నీడ పడుతుందని
నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.
నీకోసం
రంగుల ముఖాల్ని తొడుక్కుంటూ
నీ మనసుకి అద్దంలా మారిపోతూ
అమృతాన్ని వర్షిస్తూ
నేనూ  …
నాతో మాట్లాడాలని
సుడులు తిరుగుతూ
పచ్చటి సైగలు చేస్తూ
పూలను విసురుతూ
గాలిపైటనాడిస్తూ
అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ
నువ్వూ …
పరస్పరం ప్రేమించుకోని క్షణముండదు
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం ….

Monday, July 8, 2013

బాల్యం తిరిగొచ్చింది

ఎన్నేళ్ళ క్రితమో
నిర్దయగా నన్నొదిలిపోయిన బాల్యం
ఇవాళ నీ మెత్తని అరచేతిలోంచి
తిరిగి నాలోకి ప్రవహిస్తోంది.

నా వేలు పట్టుకుని నువ్వు నడిపిస్తుంటే
నిన్న అడుగులు నేర్చుకున్న నీ దగ్గర
ఇష్టమైన దారిలో నడవడం
ఇప్పుడే నేర్చుకుంటున్నాను.

చిట్టి చిట్టి పదాలు నీకు నేర్పుతూనే
నానార్ధాలకో విపరీతార్ధాలకో బెదరడం మానేసి
భావాలకి రెక్కలిచ్చి
పెదవులపైకి ఎగరేయడం నేర్చుకుంటున్నాను.

అంతర్జాలంలో వలేసి
నీకోసం కొన్ని ఆటల్ని పట్టుకుంటాను కానీ
నువ్వు నాకు నేర్పే ఆటలాడాక
నింగి తారల్ని చూసి
విద్యుద్దీపాలెందుకు తలొంచుకుంటాయో
తెలుసుకుంటున్నాను.

అందరూ అన్నివైపులా చేరి
స్వేఛ్ఛగా పెరిగిన కొమ్మాలన్నీ నరికేసినా
చిటారుకొమ్మన పూసిన పుష్ప మాధుర్యంతోనే
చెట్టు పరిమళించినట్టు
నీ నవ్వుల్లోనే
నేను విరబూయడం నేర్చుకుంటున్నాను.

ఆకాశపు వెలుగునంతా
సాయంకాలానికల్లా ఏరుకొచ్చి ఒకచోట కుప్పగా పోస్తే
ఏ అల్లరి మబ్బో
ఆ వెన్నెల కుప్పని భళ్ళున ఒలకబోసినట్టు
నీ చేష్టలు
నా జీవిత పుస్తకంలో ప్రతి కాగితం లోను
వాడని పూలుగా పేర్చుకుంటున్నాను.

యవ్వనానికీ తిరిగొచ్చిన బాల్యానికి మధ్య
శత సహస్ర రహస్యాల దూరాన్ని
కొంటె చూపుతోనే చెరిపావో
తప్పటడుగులోనే కొలిచావో కానీ
నేను నీకు అమ్మనో
నువ్వే నాకు అమ్మవో తెలీని సందిగ్థావస్తలో
నా పెద్దరికమంతా
సెలయేట్లో కురిసే వాన చినుకైపోయింది.

( ఈ కవితకు NATS 2013  కవితల పోటీలో మూడవ బహుమతి లభించింది)