Sunday, February 16, 2014

ఒక తియ్యని కల

         

అన్ని నక్షత్రాలనూ దాటుకుని
ఆ కల మళ్ళీ వస్తుంది.
ఎదురు చూడని ఏ రాత్రిలోనో
కాస్తంత వెన్నెలని
కొంగున కట్టి పోతుంది.

ఊహలకు మల్లే
కుంచెలూ, రంగులూ
మేళవించే మెళకువలు
ఏవీ అనుమతించని కల
నిద్ర ముఖం మీద
చల్లటి చిలకరింపై
తనకు తానుగా
అలంకరించుకు వస్తుంది.
          హద్దులకో పద్దులకో భయపడి
          ఏ మలుపుల్లోనో
          నాటకుండానే వదిలేసిన ఆశల విత్తుల్ని
          ఆ నిరభ్యంతరపు క్షణాల్లో
          నిర్భయంగా చూపిస్తుంది
వాడిన దండ తీసేసినా
కురులను వీడని మల్లెల వాసనలా
రాత్రి వాడిపోయినా
ఆ కల
నన్ను చుట్టుకునే ఉంటుంది.
          నావి కాలేకపోతున్న క్షణాలతో
          నేను పడుతున్న ప్రయాసలో
          చెమటని తుడిచే
          చిరుగాలై వస్తుంది.
          బలవంతపు సంతకాలలో
          బరువు దించే నిట్టూర్పై వస్తుంది.
అవును. అన్ని నక్షత్రాలనూ దాటుకుని
నిద్ర సిగలో వికసించడానికి
ఆ కల మళ్ళీ వస్తుంది.
 

(జనవరి ఈమాట వెబ్  పత్రికలో ప్రచురితమయింది. )