Wednesday, January 26, 2011

బాలూ గాడి కథలు ... 1

భావన ఏడుస్తోంది....

కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకోవట్లేదు ఒక్క భావన తమ్ముడు పదేళ్ళ బాలూ తప్ప. వాళ్ళమ్మ ఓరకంట చూస్తూనే కూరలు తరుక్కుంటోంది. అమ్మమ్మ పుస్తకం చదువుకుంటోంది. 
ఎవ్వరూ పట్టించుకోవట్లేదని భావన దుఖం ఇంకా ఎక్కువవుతోంది.  

"ఛీ నేను ఏడిచినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు... ఎంతసేపు ఏడవాలి? ఎవరైనా ఓదారిస్తే ఆపెయ్యచ్చు అనుకుంటే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు... ఓదార్చకుండా ఆపేస్తే ఇంక నాకు విలువుండదేమో. కాసేపు ఏడిచి అదే ఊరుకుంటుందిలే అనేసుకుంటారు .. " 

చూసింది చూసింది ... ఒక్క అరుపు అరిచింది వాళ్ళమ్మ. "ఏయ్ ఇంక ఆపవే. నువ్వెంత ఏడ్చినా ఆ బార్బీ బొమ్మ కొనేది లేదు. ఒక బొమ్మ పెట్టుకున్నావ్ కదా ఇప్పటికే మళ్ళా ఏంటి? "

"బార్బీ బొమ్మ చూస్తే నాకు కొనుక్కోవాలని ఆశ  కలుగుతుంది. నా ఫ్రెండ్స్ అందరి దగ్గరా కూడా రెండు మూడు బొమ్మలున్నాయి. " ఏడుపాపి తనూ అరిచింది భావన. 

"నాకూ ఆశగా ఉంది. నీకు మేథ్స్ లో సెంట్ పెర్సెంటు, మిగతా అన్ని సబ్జెటుల్లో నైంటీ పెర్సెంటూ వస్తే చూడాలని. ముందు నువ్వు నా ఆశ తీర్చు. తర్వాత నీ ఆశ నేను తీరుస్తా ..."

వాళ్ళమ్మ వ్యంగ్యంగా అన్న మాటలకి, అమ్మమ్మ సమర్ధింపు చూపు కీ, ముక్కంతా కోపంతో ఎరుపెక్కిపోయింది భావన కి. "దేనికీ దేనికీ లింకు పెడతారు? " అంటూ కోపంగా అక్కడినుంచి గదిలోకి వెళ్ళిపోయింది.  

అమ్మనీ,  అమ్మమ్మనీ కోపంగా చూస్తూ బాలూ కూడా తుర్రుమని అక్క వెనకాలే గదిలోకి పరుగెట్టాడు.

"అక్కా ఏడవకు. మన రాములవారి గుళ్ళో పదకొండు ప్రదక్షిణాలు చేశావంటే నీ కోరిక తీరుతుంది. నీకు నేను తోడొస్తా పద వేళ్దాం ..." అంటూ అక్క చెయ్యి పట్టి లాగుతున్న బాలూ గాడి వంక చూసి పకా పకా నవ్వడం పెద్దాళ్ళ వంతయింది. 
Saturday, January 22, 2011

ఒక మాంచి డాక్టరు ...

ఈ మధ్యనే మాకూ తెలిసిన ఒక మంచి డాక్టరు గురించి నా బ్లాగ్ లో రాస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపించి ఈ టపా రాస్తున్నాను
మిగతా చోట్ల ఏమో గానీ సిటీల్లో హాస్పిటల్స్ కి వెళ్తే మాత్రం, నువ్వొక గుంపులో గోవిందానివి అన్నట్టే చూస్తారు. డాక్టర్ దాకా వద్దు ముందు చీటీలు రాసే చోట కూడా గౌరవం, మన ప్రశ్నలకి సమాధానం ఉండవు. పోనీ అవి బాగుంటే డాక్టర్ మన బాధ పట్టించుకోరు. అయిదు నిమిషాలే నీకు టైము అన్నట్టు ముఖం పెట్టి కొందరు, గంభీరంగా మౌనమే నా భాష అన్నట్టు కొందరు, నీకు వచ్చినవి కామన్ జబ్బులే లే నాకు చెప్పింది చాలు, బయట కాంపౌండర్ ఒక ప్రింటెడ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అని కొందరు. ఇలా ఉంది వ్యవహారం హైదరాబాదులోని చాలా హాస్పిటల్స్ లో.

ఇలాంటి చోట మంచి అంటే మంచి హస్తవాసి మాత్రమే కాదు మంచి గుణం కూడా ఉన్న డాక్టర్ తారసపడితే ఎడారిలో ఒయాసిస్సులా అనిపించేస్తుంది.

హైదరాబాదులో KIMS హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగం లో డాక్టర్ జివానీ గారి గురించి ఆయన పేషంట్ మాటల్లోనే ఒక్క ముక్కలో చెప్పాలంటే  "ఈయనని చూస్తేనే సగం జబ్బు తగ్గిపోతుంది... "

ఏ టైములో అయినా ఎంత రద్దీగా , యాంజియోగ్రాములు చేసాకో, రవుండ్స్ కి వెళ్ళొచ్చాకో ఆయనని కన్సల్ట్ చేస్తే కూడా, మన పేరు పిలిచాక ఆయన రూము లోకి అడుగుపెడుతూనే నవ్వుతూ పలకరించి షేక్ హాండ్ ఇచ్చి "హెల్లో ... హవ్ ఆర్ యూ? " అని అడుగుతారు. ఆ పలకరింపుతోనే పేషంట్ కి కొండంత ధైర్యం వచ్చేస్తుంది. మన బాధలన్నీ చాలా శ్రధ్ధగా వింటారు, మన యక్ష ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇస్తారు.    

ఈ మధ్యన మా ఫామిలీలో ఒకరికి అక్కడ బైపాస్ జరిగింది. ఇంతకు ముందు KIMS గురించి మాకు పెద్దగా తెలీదు. ఇంటర్నెట్ లో కూడా పెద్దగా రివ్యూస్ ఏమీ కనిపించలేదు. ఎప్పుడో ఏడాది క్రితం అత్యవసరం అయ్యి KIMS కి వెళదాం అనుకొని కర్డియాలజీ కి ఫోన్ చేస్తే ఆ టైముకి జివానీ గారు ఉండటం వల్ల ఆయన దగ్గరే కన్సల్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అప్పుడు మొదటి సారి వెళ్ళినప్పుడే అక్కద స్టాఫ్ మనకిచ్చే గౌరవం, వాళ్ళ సర్వీస్ అన్నిటికీ మించి జివానీ గారు కేస్ హాండిల్ చేసిన తీరూ అలా గుర్తుండిపోయి ఇక వేరే అలోచించకుండా ఇప్పుడూ అక్కడికే వెళ్ళాం.    
యాంజియోగ్రాం, బైపాస్ అన్నీ అక్కడే చేయించి ఏ కంప్లైంటూ లేకుండా, ఎక్కడా విసుగు అనేది కలగకుండా ఇంటికి వచ్చాం.

ఈ హాస్పిటల్ లో క్లీనర్ దగ్గర నుంచి పెద్ద surgen వరకూ అందరూ పేషంట్ కి గౌరవం ఇస్తారు.

సిటీల్లో చాలా హాస్పిటల్స్ లో స్టాఫ్ కూడా మనం చెప్పేవి వినేంత టైమూ, ఓపికా లేనట్టు ఉంటారు. అలాటి హాస్పిటల్స్ కు వెళ్ళి విసిగిపోయి ఇలా అరుదుగా కనిపించే డాక్టరు గురించి, ఈ హాస్పిటల్స్ గురించీ నలుగురికీ చెప్పాలనిపించింది. మిగతా డిపార్ట్మెంట్స్ గురించి నాకు తెలీదు కాని కార్డియాక్ సమస్యలకు మాత్రం రెండో అలోచన లేకుండా KIMS కి వెళ్ళొచ్చు అనిపించింది.

  

Saturday, January 15, 2011

మాయ చేసే మూన్నార్ ...

క్రితం వారం పెద్ద ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు అనుకుని మూన్నార్ వెళ్ళాం.


వెళ్ళేముందు కొద్దిగా రిసెర్చ్ చేస్తే కొచ్చి దారికన్నా కోయంబత్తూర్ దారి చాలా బావుంటుందని తెలిసి కోయంబత్తూర్ ద్వారా వెళ్ళాం.కోయంబత్తూర్ నుంచి ఉడుమల్పేట్ దాకా వేడి వాతావరణమే ఉంటుంది. ఉడుమల్పేట నుంచి దారి ఎంతో అందంగా ఉంటుంది. కేరళా ని God's own country అని ఎందుకన్నారో మెల్ల మెల్లగా అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రయాణం అంత అద్భుతం. ఎత్తయిన కొండలమీదనుంచి మన బస్ వెళుతూ ఉంటే, మనం ప్రయాణించే దారికీ , పక్కన కొండలకీ మధ్యనున్న లోయలో సెలయేరొకటి మనతో పాటే పయనిస్తూ దారంతా కనిపిస్తుంది. బస్ కిటికీ లోంచి ఘాట్ రోడ్డు అంచులమీద కాపలాగా నించున్నా చెట్లమధ్యలోంచి ఆ సెలయేటిని వెతుక్కుంటూ ప్రయానించడం లో ఏదో గమ్మతైన హాయి.


ఆ దారిలో ఎన్నో చోట్ల ఇదే సెలయేరు అద్భుతమైన జలపాతంగా దర్శనమిస్తుంది. బండరాళ్ళమీంచి పాటపాడుకుంటూ వయ్యారంగా దూకే ఆ సెలయేటిని చూస్తున్నంత సేపూ ఇస్మాయిల్ గారి సెలయేరు కవితే మదిలో మెదిలింది.


" సెలయేరా సెలయేరా

గల గల మంటూ నిత్యం

ఎలా పాడగలుగుతున్నావు?చూడూ ...

నా బ్రతుకు నిండా రాళ్ళు

పాడకుంటే ఎలా ... "లోయలమధ్యలో అందమైన రహస్యాలని వెత్తుక్కుంటూ పచ్చటి ఆ ప్రకృతిలో మమేకమవుతుంటే మనసు చేసే ఏ అన్వేషణకో నిజంగా దేవుడి ఇంటికే వచ్చినట్టున్న ఈ ప్రకృతే ఆఖరిమెట్టేమో అనిపిస్తుంది.
 
మున్నార్ లో జనసాంద్రత చాలా తక్కువ. అందుకే అక్కడ ప్రకృతిని, ఆ పచ్చదనాన్నీ చాలా సహజంగా ప్రశాంతంగా ఆస్వాదించగలం.
 
మీ కోసం ఇంకొన్ని ఫొటోలు ....