Saturday, May 30, 2015

ప్రేమోత్సవం

సాంధ్య రాగం పిలిచే వరకూ
సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి

ఆకాశాన్ని ప్రేమిస్తూ
తన ఆరాధనంతా పూవుల్లోనో, పళ్ళలోనో
ఏదీ లేకుంటే తన దేహంలోనో నింపుకుని
ప్రేమకి నిర్వచనమవుతుంది చెట్టు

రాళ్ళని అలంకరించే సెలయేట్లోనూ
విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ
మట్టి పొత్తిళ్ళలో గుర్తింపుకి నోచుకోని చిట్టి రాళ్ళలోనూ
అన్నిట్లోనూ ప్రేముంది.
కారణాల్లేకుండానే ప్రేమ పంచగల దమ్ముంది.

మనిషికి మాత్రం
కాలమంతా ప్రేమమయం కావాలనేమీ లేదుగానీ
నియంత్రిత నైసర్గిక ప్రపంచాన్ని దాటి
శిఖరాగ్రం మీద కాసేపు
తన గుండె చప్పుడు తాను వినడానికీ
నక్షత్రాల వెలుగు లిపిలో మనసు వ్రాసుకోవడానికీ
అరణ్య పుష్ప సుగంధాల్లో స్నానించి
స్వప్న గ్రంధాల్ని ఆవిష్కరించుకోడానికీ
                                                            ఓ కారణం తప్పకుండా కావాలి.

1 comment:

  1. ఎందుకే ఓ ప్రేమ ఇలా విసిగిస్తావు?
    చీకటి లో గ్రుడ్డివానిలా చేస్తావు నన్ను.
    స్వప్న వేణువులు ఊది ఊది నా గొంతు జీరబోయింది.
    పుష్ప కైంకర్యం చేయనా నీకు నా అశ్రు ధారలతో?
    నా ప్రేగులని విశ్వమోహన వీణ తంత్రులుగా చేసి వాయించనా?
    ఎందుకే ఓ ప్రేమ ఇలా వేధిస్తావు?-inspired by your mystic poem

    ReplyDelete